తొలి టెస్టు తర్వాత స్వదేశానికి కోహ్లి

10 Nov, 2020 06:05 IST|Sakshi

ఆస్ట్రేలియా పర్యటనలో చివరి మూడు టెస్టులకు భారత కెప్టెన్‌ దూరం

టెస్టు జట్టులోకి రోహిత్‌ శర్మ ఎంపిక

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి రానున్నాడు. తొలి టెస్టు ఆడాక భారత్‌కు పయనమవుతాడు. అయితే అన్ని ఫార్మాట్లకు ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇచ్చిన సెలక్షన్‌ కమిటీ కెప్టెన్‌ గైర్హాజరీ నేపథ్యంలో టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికైన ‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి గాయంతో ఆసీస్‌ పర్యటనకు దూరమయ్యాడు. కేవలం టి20లకే ఎంపికైన సంజూ సామ్సన్‌ను ఇప్పుడు వన్డే జట్టులోనూ ఆడతాడు. నేడు జరిగే ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిసిన మరుసటి రోజే టీమిండియా యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది.

భార్య ప్రసవం ఉండటంతో...
టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమె డెలివరీ తేదీ జనవరిలో ఉంది. దీంతో అనుష్క ప్రసవ సమయంలో ఆమెకు తోడుగా ఉండాలని కోహ్లి భావించాడు. ఈ మేరకు తన మనసులోని మాటను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రముఖులకు తెలిపాడు. కోహ్లి అభ్యర్థనను బీసీసీఐ అంగీకరించింది. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కోహ్లికి అనుమతి మంజూరు చేసింది.  రెండు నెలలపాటు సుదీర్ఘంగా సాగే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ తొలుత మూడు వన్డే మ్యాచ్‌లు (నవంబర్‌ 27, 29, డిసెంబర్‌ 2) ఆడుతుంది. అనంతరం మూడు టి20 మ్యాచ్‌ల్లో (డిసెంబర్‌ 4, 6, 8) బరిలోకి దిగుతుంది. అనంతరం నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు అడిలైడ్‌లో డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు డే–నైట్‌గా జరుగుతుంది. ఈ మ్యాచ్‌ ముగిశాకే కోహ్లి భారత్‌కు తిరిగి వస్తాడు. మెల్‌బోర్న్‌లో జరిగే రెండో టెస్టు (26 నుంచి 30) సహా సిడ్నీ (జనవరి 7 నుంచి 11), బ్రిస్బేన్‌ (15 నుంచి 19)లలో జరిగే మూడో, నాలుగో టెస్టులకు కోహ్లి దూరమవుతాడు.  

ఆసీస్‌కు ‘హిట్‌మ్యాన్‌’...
ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్న సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ టెస్టులాడేందుకు ఈ నెలాఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరతాడు. రోహిత్‌ చేరిక, ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ ‘బీసీసీఐ వైద్య బృందం అతని ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇదే విషయాన్ని మేం సెలక్షన్‌ కమిటీకి తెలియజేశాం. పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకునేందుకే అతనికి పరిమిత ఓవర్ల సిరీస్‌కు విశ్రాంతినిచ్చాం. ఇప్పుడు బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీకి ఎంపిక చేశాం’ అని తెలిపారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లోని పునరావాస శిబిరంలో ఉన్న ఇషాంత్‌ శర్మతో కలిసి రోహిత్‌ అక్కడికి పయనమవుతాడు.

గాయం దాచిన వరుణ్‌...
‘మిస్టరీ స్పిన్నర్‌’ వరుణ్‌ చక్రవర్తి ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. అతన్ని టి20ల కోసం ఎంపిక చేయగా... భుజం గాయంతో అక్కడికి వెళ్లడం లేదు. ఐపీఎల్‌ సందర్భంగా గాయమైన సంగతిని వరుణ్‌ దాచి పెట్టాడని బీసీసీఐ గుర్రుగా ఉంది. అతని భుజానికి సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాగా అతని స్థానంలో ‘యార్కర్‌ స్పెషలిస్ట్‌’, తమిళనాడు ఎడంచేతి వాటం పేస్‌ బౌలర్‌ నటరాజన్‌ను ఎంపిక చేశారు. తొడ కండరాల గాయంతో ఉన్న వృద్ధిమాన్‌ సాహాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. నెట్‌బౌలర్‌గా కమలేశ్‌ నాగర్‌కోటి అక్కడికి వెళ్లడం లేదు. అతన్ని ఎన్‌సీఏకు పంపుతున్నారు.   

>
మరిన్ని వార్తలు