టీ20 ప్రపంచకప్‌లో అతను కీలకం కానున్నాడు

9 Dec, 2020 09:07 IST|Sakshi

సిడ్నీ : తమిళనాడు నుంచి టీమిండియాకు ఎంపికైన యార్కర్‌ బౌలర్‌ టి.నటరాజన్‌ అరంగేట్రం సిరీస్‌నే మధురానుభూతిగా మలుచుకున్నాడు. ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లాడిన నటరాజన్‌ 6.91 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆసీస్‌తో జరిగిన మూడో వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన నటరాజన్‌పై తొలి మ్యాచ్‌ నుంచే ప్రశంసల జల్లు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నటరాజన్‌ ప్రదర్శన అద్బుతమని మెచ్చకున్నాడు. మంగళవారం మ్యాచ్‌ ముగిసిన అనంతరం అవార్డు ప్రధాన కార్యక్రమంలో కోహ్లి మాట్లాడాడు. (చదవండి : నెట్‌ బౌలర్‌గా వచ్చా.. ఇంకేం కావాలి: నటరాజన్‌)

'నటరాజన్‌ ప్రదర్శనపై ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. షమీ, బుమ్రా లాంటి కీలక బౌలర్ల గైర్హాజరీలో నటరాజన్‌ 6 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అరంగేట్రం సిరీస్‌లోనే ఇంతలా ఆకట్టుకున్న నటరాజన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి చేరుకున్న అతను రానున్న మ్యాచ్‌ల్లో ఇదే ప్రదర్శన చేస్తాడని ఆశిస్తున్నా. ఒకవేళ నటరాజన్‌ నుంచి స్థిరమైన ప్రదర్శన ఉంటే రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక బౌలర్‌ కానున్నాడ'ని తెలిపాడు.(చదవండి : కోహ్లి ఆలస్యం చేశావు.. వెంటనే రివ్యూ కోరుంటే)

ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు రోహిత్‌ శర్మ, బుమ్రా, షమీ లాంటి కీలక ఆటగాళ్లు లేకున్నా.. ఒత్తిడిని దరి చేరకుండా యువ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఓడినా.. చివరి వన్డే గెలవడంతో ఆత్మ విశ్వాసం పెరిగింది. అదే నమ్మకంతో టీ20 సిరీస్‌ను ఆరంభించాం. మొదటి టీ20లో తక్కువ స్కోరు నమోదు చేసినా బౌలర్ల అద్భుత ప్రతిభతో మ్యాచ్‌ను గెలిచాం. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లోనూ అదే ప్రతిభను కనబరిచి సిరీస్‌ను దక్కించుకున్నాం. చివరి టీ20లో ఓడినా.. జట్టులోని ఆటగాళ్లంతా సమిష్టి ప్రదర్శన కనబరిచాం. ఫీల్డింగ్‌ లోపాలతో పాటు బౌలింగ్‌లోనూ కాస్త మెరుగైన ప్రదర్శన వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేది 'అని కోహ్లి పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు