IPL 2022: ఆర్సీబీకి ఎంపికైన కొత్తలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్న కోహ్లి.. 

6 Feb, 2022 16:40 IST|Sakshi

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఎంపికైన కొత్తలో(2008, ఐపీఎల్‌ తొలి సీజన్‌ తర్వాత) తనకు జరిగిన అవమానాన్ని పాడ్కాస్ట్‌ షో వేదికగా షేర్‌ చేసుకున్నాడు టీమిండియా మాజీ సారధి విరాట్‌ కోహ్లి. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగబోయే ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు ఆర్సీబీ యాజమాన్యం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోహ్లి.. ఆర్సీబీతో తన గత అనుభవాలను షేర్‌ చేసుకుంటూ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఐపీఎల్‌ కెరీర్‌ ఆరంభం నుంచి 15 సీజన్ల పాటు ఆర్సీబీకి మాత్రమే ప్రాతినిధ్యం వహించి, ఐపీఎల్‌ చరిత్రలో ఏ ఆటగాడికి దక్కని ఘనతను సొంతం చేసుకున్న కోహ్లిని.. 2008 సీజన్‌ తర్వాత ఆర్సీబీ యాజమాన్యం ఘోరంగా అవమానించిందట. 

తొలి సీజన్‌లో 15 సగటుతో కేవలం 165 పరుగులు మాత్రమే చేయడంతో తనను ఎయిర్‌పోర్ట్‌ నుంచి పికప్‌ చేసుకునుందుకు డొక్కు ఓమ్నీ కారును పంపారని, మిగతా ఆటగాళ్లకైతే ఏసీ కార్లు వెళ్లాయని, ఆ అనుభవం తనను బాగా కలచి వేసిందని సదరు షో సందర్భంగా కోహ్లి గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌ మొదటి మూడు సీజన్లలో తన పారితోషికం కేవలం రూ. 12 లక్షలు మాత్రమేనని కోహ్లి ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, ఆర్సీబీ తరఫున భారీగా పరుగులు సాధించిన కోహ్లి.. తన కెప్టెన్సీలో జట్టుకు ఒక్క టైటిల్‌ను కూడా అందించలేకపోయాడు. ఇదే ప్రభావం అతని అంతర్జాతీయ కెరీర్‌పైనా పడి, చివరికి టీమిండియా సారధ్య బాధ్యతలను కోల్పోయాడు. 
చదవండి: అతనొచ్చాడు.. టీమిండియా ఆటగాళ్ల తలరాతలు మార్చాడు..!

మరిన్ని వార్తలు