Virat Kohli International Debut: 14 ఏళ్ల కెరీర్‌ పూర్తి.. కోహ్లి ఎమోషనల్

18 Aug, 2022 12:43 IST|Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి నేటితో(ఆగస్టు 18న) 14 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా..''14 ఏళ్ల క్రితం ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టా.. నాకు దక్కిన గొప్ప గౌరవం'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

ఇక ఆగస్టు 18, 2008న డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా కోహ్లి టీమిండియా తరపున ఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్‌లో కోహ్లి అనుకున్నంతగా రాణించలేకపోయాడు. 22 బంతులాడి కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే తాను రాణించకున్నా ఆ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలా కోహ్లి తన డెబ్యూ మ్యాచ్‌లోనే తొలి విజయాన్ని నమోదు చేశాడు.

''ఇంతింతై వటుడింతై'' అన్న తరహాలో అనతి కాలంలోనే టీమిండియాలో కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో ఎక్కడ వెనుదిరిగి చూసుకునే అవకాశం కూడా రాలేదు. కొన్నేళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో ఒక్క మ్యాచ్‌ కూడా మిస్సవ్వకుండా ఆడాడంటే కోహ్లి ఫిట్‌నెస్‌ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. చేజింగ్‌లో కోహ్లి కింగ్‌గా మారిపోయాడు.  భారత్‌ లక్ష్య ఛేధనకు దిగిందంటే కచ్చితంగా మ్యాచ్‌ గెలుస్తుంది అన్న అభిప్రాయానికి తీసుకొచ్చాడు.

 ఏ జట్టు ఆటగాడైనా ఒక మ్యాచ్‌లో ఆడాడంటే తొలి ఇన్నింగ్స్‌ నుంచే ఎక్కువ స్కోర్లు.. సెంచరీలు గాని చూస్తుంటాం. కానీ కోహ్లి విషయంలో అది రివర్స్‌ అయిపోయింది. కోహ్లి కెరీర్‌లో 43 వన్డే సెంచరీలు ఉంటే.. అందులో చేజింగ్‌లోనే 22 సెంచరీలు సాధించాడంటే అతని దూకుడేంటో అర్థమవుతుంది.  ఒక దశలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే సెంచరీలు(49సెంచరీలు) మార్క్‌ను క్రాస్‌ చేసి అగ్రస్థానంలోకి దూసుకొస్తాడని అంతా భావించారు. కానీ క్రమక్రమంగా కోహ్లి ఆటతీరు మసకబారుతూ వచ్చింది. 14 ఏళ్ల కెరీర్‌లో టెస్టులు, వన్డేలు కలిపి 70 సెంచరీలు అందుకున్న కోహ్లి.. 71వ సెంచరీ మార్క్‌ను అందుకోవడం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఎంత మంచిగా ఆడే క్రికెటర్‌కైనా గడ్డు సమయం ఉండడం సహజం. కానీ కోహ్లి విషయంలో అది ఎక్కువకాలం కొనసాగుతూ వస్తుంది. 

ఇటీవలే విండీస్‌ టూర్‌కు దూరంగా ఉన్న కోహ్లి.. ఆసియా కప్‌ 2022 ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్న కోహ్లి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనైనా(ఆగస్టు 28న) తన 71వ సెంచరీ సాధించాలని కోరుకుందాం. ఇక 14 ఏళ్ల కెరీర్‌లో కోహ్లి 102 టెస్టుల్లో 8074 పరుగులు, 262 వన్డేల్లో 12,344 పరుగులు, 99 టి20ల్లో 3308 పరుగులు సాధించాడు. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 సెంచరీలు సాధించిన కోహ్లి.. టి20ల్లో మాత్రం 30 అర్థసెంచరీలు చేశాడు.

A post shared by Virat Kohli (@virat.kohli)

చదవండి: జిమ్‌లో చెమటోడుస్తున్న కోహ్లి.. వీడియో వైరల్‌! కింగ్‌.. ఒక్క సెంచరీ ప్లీజ్‌!

Virat Kohli: చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లే.. కానీ ఒంటరిగా ఫీలయ్యా!

మరిన్ని వార్తలు