కోహ్లి ట్రిక్‌ వర్కౌట్‌ కాలేదు..రిప్లై అదిరింది!

7 Nov, 2020 15:59 IST|Sakshi
కోహ్లి-మనీష్‌ పాండే(ఫోటో సోర్స్‌; డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వీఐపీ)

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ప్లేఆఫ్స్‌తోనే సంతృప్తి పడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు.. నిన్న జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఆర్సీబీ  ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. వరుస ఓటములతో కుదేల్ అయిన జట్టులో స్ఫూర్తినింపాల్సిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. దానికి భిన్నంగా వ్యవహరించాడు.  లీగ్ దశ మ్యాచ్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటే వరుసగా అయిదింట్లో ఓడిపోయింది. అయితే ప్రత్యర్థి జట్టు సన్‌రైజర్స్‌ ఆటగాడు మనీష్‌ పాండేపై స్లెడ్జింగ్‌కు దిగాడు. అతన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇన్నింగ్ మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ అది. సిరాజ్ వేసిన రెండోబంతిని పాండే కవర్స్ వైపు ఆడాడు. అక్కడ ఉన్న మొయిన్ అలీ ఆ బంతిని ఫీల్డ్ చేశాడు. దాన్ని కోహ్లికి అందించాడు. బంతిని అందుకున్న కోహ్లి.. మనీష్ పాండే వైపు చూస్తూ బిగ్గరగా నవ్వాడు. (ఆర్సీబీ ఔట్‌.. కోహ్లి ఎమోషనల్‌ ట్వీట్‌!)

బహుత్ బడియా. ఆజ్ నహీ మార్ రహా షాట్.. అచ్ఛా చలో.. అంటూ పాండేను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. ఓపెనర్ గోస్వామి అవుట్ అయిన తరువాత వన్‌డౌన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన పాండే పరుగు చేయడానికి ఐదు బంతులు ఆడాడు. అయితే కోహ్లి స్లెడ్జ్‌ చేసిన తర్వాత ఒక బంతిని వదిలిపెట్టిన మనీష్‌ పాండే..ఆ ఓవర్‌ నాల్గో బంతికి సిక్స్‌తో సమాధానం చెప్పాడు. మనీష్‌ పాండేను రెచ్చగొట్టడానికి కోహ్లి ట్రిక్‌ వర్కౌట్‌ కాలేదు. ఇదిలా ఉంచితే, సహచర టీమిండియా ఆటగాడిపై స్లెడ్జింగ్‌ చేయడంపై సన్‌రైజర్స్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ నెల చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లే టీమిండియా జట్టుకు మనీష్ పాండే ఎంపికయ్యాడు. తనతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోబోయే క్రికెటర్‌పైనే స్లెడ్జింగ్‌కు పాల్పడటాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తప్పుపడుతున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో మనీష్‌ పాండే 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 24 పరుగులు చేశాడు.

మరిన్ని వార్తలు