సుదీర్ఘ కాలం ‘బయో బబుల్‌’లో కష్టమే

7 Nov, 2020 05:40 IST|Sakshi

పర్యటనల వ్యవధి కుదించాలన్న కెప్టెన్‌ కోహ్లి

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నమెంట్‌ కోసం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ‘బయో బబుల్‌’లోకి ప్రవేశించి 75 రోజులైంది. మరో ఐదు రోజులు కలుపుకుంటే 80 రోజులవుతుంది. ఆ తర్వాత వెంటనే ఆస్ట్రేలియా పర్యటన కోసం అతను బయలుదేరాల్సి ఉంది. అక్కడా బయో బబుల్‌లో గడపాల్సి ఉండగా, జనవరి 19న పర్యటన ముగుస్తుంది. ఇదే విషయంపై కోహ్లి ఆందోళన వ్యక్తం చేశాడు. సుదీర్ఘ కాలం ‘బయో బబుల్‌’లో ఉండాల్సి రావడం చాలా కష్టమని అతను వ్యాఖ్యానించాడు. ఇది ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిస్తుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇండోర్‌ గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్‌లు, ప్రైవేట్‌ బీచ్‌లలో సరదాలు కొంత వరకు ఒత్తిడిని తప్పించగలవేమో తప్ప పూర్తిగా కాదని అతను అన్నాడు.

‘బయో బబుల్‌’లో జరిగే సిరీస్‌ల వ్యవధిని తగ్గించే విషయంపై దృష్టి పెట్టాలని కోహ్లి సూచించాడు. ‘బయో బబుల్‌లో సహచరులతో కలిసి గడపడం, మంచి సాహచర్యం ఉండటంతో ఆరంభంలో బాగానే అనిపించింది. కానీ ఇది సుదీర్ఘంగా కొనసాగడమే సమస్య. రాన్రానూ అంతా కఠినంగా అనిపిస్తోంది. వినోదం కోసం ఎన్ని ఏర్పాట్లు చేసినా... మానసికంగా ప్రశాంతంగా ఉండే విషయం గురించి కూడా సీరియస్‌గా ఆలోచించాలి. ఇదే అన్నింటికంటే ముఖ్యం. రాబోయే రోజుల్లో సిరీస్‌ల వ్యవధి తగ్గించే అంశంపై దృష్టి పెట్టాలి. ఒకే రకమైన వాతావరణంలో 80 రోజుల పాటు ఉంటూ మరో ప్రత్యామ్నాయం లేకుండా, భిన్నంగా కనిపించకుండా చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం చాలా కష్టం. ఇది మానసికంగా మాపై ప్రభావం చూపిస్తుంది’ అని కోహ్లి విశ్లేషించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు