Virat Kohli: ఐపీఎల్‌ కెప్టెన్సీపై కోహ్లి కీలక నిర్ణయం

20 Sep, 2021 02:50 IST|Sakshi

ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగిశాక బెంగళూరు కెప్టెన్‌గా వైదొలగనున్న కోహ్లి  

Virat Kohli Sted Down As IPL Captain.. అబుదాబి: గత గురువారం... ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ ముగిశాక భారత టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన విరాట్‌ కోహ్లి... ఆదివారం మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌–14వ సీజన్‌ ముగిశాక తాను సారథ్యం వహిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు పగ్గాలు వదులుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ఆర్‌సీబీ అధికారిక ట్విటర్‌ ఖాతాలో కోహ్లి వీడియో సందేశం విడుదల చేశాడు. ‘ఆర్‌సీబీ కెప్టెన్‌ హోదాలో నాకిదే చివరి ఐపీఎల్‌ సీజన్‌. గతంలో చెప్పినట్టుగా ఐపీఎల్‌లో చివరి మ్యాచ్‌ ఆడినంత కాలం ప్లేయర్‌గా బెంగళూరు జట్టు తరఫున మాత్రమే బరిలోకి దిగుతాను. మరో ఐపీఎల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనని మరోసారి స్పష్టం చేస్తున్నాను. ఇంతకాలం నాపై నమ్మకం ఉంచి, నన్ను ప్రోత్సహించి, మద్దతుగా నిలిచిన ఆర్‌సీబీ యాజమాన్యానికి, కోచ్‌లకు, సహచర ఆటగాళ్లకు, అభిమానులకు ధన్యవాదాలు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.  

చదవండి: Suresh Raina Wicket: అయ్యో రైనా.. వికెట్‌తో పాటు బ్యాట్‌ను విరగొట్టుకున్నాడు

ఐపీఎల్‌ ప్రారంభమైన 2008 నుంచి కోహ్లి ఆర్‌సీబీ జట్టు సభ్యుడిగా ఉన్నాడు. 2011లో నాటి  కెప్టెన్‌ వెటోరి గాయపడటంతో కొన్ని మ్యాచ్‌ల్లో కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2013 సీజన్‌  నుంచి పూర్తి స్థాయిలో బెంగళూరు జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు.  
కోహ్లి సారథ్యంలో ఆర్‌సీబీ జట్టు 132 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడింది. 60 విజయాలు, 65 పరాజయాలు నమోదు చేసింది. మూడు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి.  
కోహ్లి సారథ్యంలో ఆర్‌సీబీ 2015లో మూడో స్థానంలో, 2016లో రన్నరప్‌గా... 2020లో నాలుగో స్థానంలో నిలిచింది.  

మరిన్ని వార్తలు