కోహ్లి ఏదో చెప్పబోయాడు.. అంపైర్‌ పట్టించుకుంటే కదా!

27 Mar, 2021 15:55 IST|Sakshi
రనౌట్‌ గురించి అంపైర్‌కు వివరించే ప్రయత్నం చేస్తున్న కోహ్లి(ఫొటో: డిస్నీ+హాట్‌స్టార్‌)

కోహ్లిని పట్టించుకోని అంపైర్‌.. వైరల్‌ వీడియో

పుణె: ప్రత్యర్థి ఎవరైనా, ఎక్కడ ఆడుతున్నా సరే మైదానంలో దూకుడుగా ఉండటం టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అలవాటేనన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సమంజసం అనిపించని ఫలితం వస్తే తోటి క్రికెటర్లనే కాదు, అంపైర్లపై కూడా అప్పుడప్పుడు అసహనం ప్రదర్శిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో సాఫ్ట్‌ సిగ్నల్‌, అంపైర్స్‌ కాల్‌ తదితర అంశాల గురించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో, ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ అంపైర్ల పట్ల కోహ్లి ప్రవర్తనను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంపైర్లకు అగౌరపరిచే విధంగా వ్యవహరించకూడదంటూ హితవు పలికాడు.

ఈ నేపథ్యంలో, టీమిండియా- ఇంగ్లండ్‌ రెండో వన్డే సందర్భంగా కోహ్లి- అంపైర్‌ నితిన్‌ మీనన్‌ మధ్య జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. శుక్రవారం నాటి మ్యాచ్‌లో భారత్‌ విధించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లిష్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ విశ్వరూపం ప్రదర్శించిన విషయం విదితమే. అయితే, భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌ అయిదో బంతిని ఆడే క్రమంలో, అతడు రనౌట్‌ అయినట్లు అంతా భావించారు. కానీ, రిప్లేలో చాలాసార్లు పరీక్షించిన థర్డ్‌ అంపైర్‌ క్లారిటీ లేకపోవడంతో నాటౌట్‌గా ప్రకటించడంతో టీమిండియాకు నిరాశే ఎదురైంది. 

ఈ క్రమంలో అసహనానికి లోనైన కోహ్లి, అంపైర్‌ నితిన్‌ మీనన్‌ దగ్గరకు వెళ్లి రనౌట్‌కు ఆస్కారం ఉందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అంపైర్‌ మాత్రం కోహ్లిని పట్టించుకోలేదు. తనకు అసలు ఆసక్తి లేదన్నట్లుగా దూరంగా వెళ్లబోయాడు. మళ్లీ కాసేపటి తర్వాత కోహ్లికి ఏదో చెప్పగా, అతడు అక్కడి నుంచి కదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దీంతో, ‘‘కోహ్లి మాస్టర్‌ క్లాస్‌ అయితే కావొచ్చు గానీ మీనన్‌కు అతడి మాటల పట్ల ఏమాత్రం ఇంట్రస్ట్‌ లేదు’’ అంటూ నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక స్టోక్స్‌కు లైఫ్‌ లభించిన అంశంపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ స్పందిస్తూ.. బ్యాట్‌ గీత దాటి లోపలికి రాకముందే బంతి వికెట్లను గిరాటేసిందని.. అది ఔటేనని పేర్కొన్నాడు. కాగా రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఇవి కూడా చదవండి: రనౌట్‌ వివాదం.. స్టోక్స్‌ అవుటా.. కాదా?
Ind Vs Eng: కోహ్లి, పంత్‌, కేఎల్‌ రికార్డులు ఇవే!
కోహ్లి అరుదైన రికార్డు.. ఎవరికీ అందనంత దూరంలో!
కోహ్లిలా దూకుడుగా ఉండటం మా విధానం కాదు!

కోహ్లిపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఘాటు వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు