ఎవరి విషయంలోనూ రాజీపడే ప్రసక్తే లేదు: కోహ్లి

12 Mar, 2021 17:52 IST|Sakshi

అహ్మదాబాద్‌:  ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ఆడే అవకాశాన్ని కోల్పోయిన టీమిండియా స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి నిజంగా దురదృష్టవంతుడనే చెప్పాలి. గత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌కు ఆడి ఆకట్టుకున్న వరుణ్‌.. ఆపై ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీ20 జట్టులో​ చోటు దక్కించుకున్నా గాయం కారణంగా వైదొలిగాడు. తాజాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు వరుణ్‌ దూరం అయ్యాడు. టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ టెస్టులో భాగంగా యో-యో టెస్టులో వరుణ్‌ విఫలమయ్యాడు. ఇక్కడ చదవండి: వారిద్దరితోనే ఓపెనింగ్‌: కోహ్లి

అయితే ఇంగ్లండ్‌తో తొలి టీ20 జరుగనున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై మాట్లాడాడు. ‘ప్రతీ ఆటగాడు ఫిట్‌నెస్‌ టెస్టులో పాస్‌ కావాల్సిందే. వారు నిర్దేశించిన ఫిట్‌నెస్‌ ప్రమాణాలు కల్గి ఉండాలి. ప్రతీ ఆటగాడు ఫిట్‌నెస్‌ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.. అర్థం చేసుకోవాలి.  మనం అత్యున్నత స్థాయి ఫిట్‌నెస్‌ ప్రమాణాలు కల్గి ఉన్నప్పుడే మన స్కిల్స్‌ను పూర్తి స్థాయిలో బయటకు తీయడానికి ఆస్కారం ఉంటుంది.

సుదీర్ఘ కాలంగా టీమిండియా అత్యుత్తమ క్రికెట్‌ ఆడుతుందంటే అందులో ఫిట్‌నెస్‌దే ప్రధాన పాత్ర. టీమిండియా ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ ఎంత అవసరమో దాని కోసం శ్రమించాలి. ఎవరి విషయంలోనూ రాజీపడే ప్రసక్తే ఉండదు’ అని కోహ్లి తెలిపాడు. ఈ రోజు(శుక్రవారం)టీమిండియా- ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. రాత్రి గం.7.00లకు మ్యాచ్‌ ఆరంభం కానుంది. 
 

మరిన్ని వార్తలు