కోహ్లి వర్సెస్‌ రషీద్‌ ఖాన్‌

21 Sep, 2020 19:14 IST|Sakshi
విరాట్‌ కోహ్లి-డేవిడ్‌ వార్నర్‌(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ బలంగా కనిపిస్తోంది. 2013లో సన్‌రైజర్స్‌ వచ్చిన దగ్గర్నుంచీ ఆర్సీబీతో తలపడిన మ్యాచ్‌లు 15. ఇందులో ఆరెంజ్‌ క్యాప్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆర్సీబీ ఆరు మ్యాచ్‌ల్లో గెలుపును అందుకుంది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.ఆర్సీబీ అన్ని విభాగాల్లోని బలంగా కనిపిస్తున్నప్పటికీ అసలు సిసలు ఆటకు వచ్చేసరికి బలహీనపడుతోంది. పేపర్‌ పులులు అనే సామెత ఆర్సీబీకి అచ్చంగా సరిపోతుందేమే. 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరింది. గత సీజన్‌లో చివరి ప్లేస్‌కు పరిమితమైన జట్టు ఆర్సీబీ.  ఈసారైనా తమ అదృష్టం మారుతుందనే ఆశతో ఉంది కోహ్లి అండ్‌ గ్యాంగ్‌. 

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఏబీ డివిలియర్స్‌, అరోన్‌ ఫించ్‌, పార్థీవ్‌ పటేల్‌, మొయిన్‌ అలీలు బ్యాటింగ్‌లో ప్రధాన బలం. ఇక ఆసీస్‌కు చెందిన యువ సంచలనం జోష్‌ ఫిలిప్పి ఆ జట్టుకు ప్రధాన ఆకర్షణ కావొచ్చు.  పేస్‌ బౌలర్లు డెత్‌ ఓవర్లలో రాణించకపోవడమే ఆర్సీబీకి ఉ‍న్న ప్రధాన మైనస్‌. ఉమేశ్‌, షైనీ, సిరాజ్‌లో చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం ఆ జట్టును కలవరపాటుకు గురిచేస్తోంది.(చదవండి: కోహ్లి.. నీకు అర్థమవుతోందా..?)

2016లో టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. గత మూడు సీజన్లగా కనీసం ప్లేఆఫ్స్‌కు చేరుతూ వస్తూ అభిమానుల ఆశల్ని వమ్ము చేయడం లేదు. ఈ ఏడాది కూడా ప్లేఆఫ్స్‌కు చేరే జట్ల అంచనాలలో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ కచ్చితంగా ఉంటుంది. డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలో ఈ సీజన్‌ ఐపీఎల్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ ‌గెలవడానికి పూర్తిస్థాయిలో కసరత్తులు చేస్తోంది.వార్నర్‌తో పాటు కేన్‌ విలియమ్సన్‌, మనీష్‌ పాండే, జానీ బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, రషీద్‌ ఖాన్‌లు ప్రధానబలం. సిద్దార్థ కౌల్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌లు కూడా చెప్పుకోదగ్గ బౌలర్లే. ఎక్కువ మంది ఓవర్‌సీస్‌ ఆటగాళ్లు ఉండటమే ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రధాన బలహీనత. నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఒక ఐపీఎల్‌ జట్టులో ఆడాలనేది నిబంధన. తుది జట్టులో నలుగురు మించి విదేశీ ఆటగాళ్లు ఉండకూడదు. ఇక్కడ విదేశీ ఆటగాళ్ల బలంతో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇది అతి పెద్ద మైనస్‌.

కోహ్లి వర్సెస్‌ రషీద్‌ ఖాన్‌
ఈ మ్యాచ్‌లో కోహ్లి-రషీద్‌ ఖాన్‌ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు.  ఓవరాల్‌ ఐపీఎల్‌లో  కోహ్లి 177 మ్యాచ్‌లు ఆడి 5,412 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు సాధించగా స్టైక్‌రేట్‌ 131.61గా ఉంది. 2016 సీజన్‌లో కోహ్లి నాలుగు సెంచరీలు సాధించడం ఇక్కడ విశేషం. ఇక రషీద్‌ ఖాన్‌ సెన్సేషనల్‌ ఎకానమీ కల్గి ఉన్నాడు. ఇప్పటివరకూ 46 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన రషీద్‌ ఖాన్‌.. 6.55 ఎకానమీతో 55 వికెట్లు సాధించాడు.రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో పరుగులు చేయడం అటు ఉంచితే, అటాక్‌ చేయడం చాలా కష్టం. అందులోనూ స్పిన్‌కు అనుకూలించే యూఏఈ పిచ్‌ల్లో రషీద్‌ఖాన్‌ ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది. దాంతో పరుగుల మెషీన్‌ కోహ్లి, యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ల మధ్య హోరీహోరీ జరిగే అవకాశం ఉంది.

వార్నర్‌ మళ్లీ మెరుస్తాడా?
గత సీజన్‌లో ఆర్సీబీతో ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడిన తొలి మ్యాచ్‌లోనే డేవిడ్‌ వార్నర్‌ సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా జానీ బెయిర్‌స్టో కూడా శతకం నమోదు చేశాడు. ఇక ఆర్సీబీపై గత 9 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీతో పాటు 7 హాఫ్‌ సెంచరీలు నమోదు చేశాడు.దాంతో వార్నర్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. 

>
మరిన్ని వార్తలు