"కోహ్లిని బలవంతంగా తప్పుకునేలా చేశారు.." పాక్‌ మాజీ బౌలర్‌ సంచలన వ్యాఖ్యలు 

23 Jan, 2022 20:29 IST|Sakshi

Shoaib Akhtar On Virat Kohli: టీమిండియా కెప్టెన్సీ వివాదంపై పాక్‌ మాజీ బౌలర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏడేళ్లు టీమిండియాను విజయవంతంగా నడిపించిన కోహ్లిని బలవంత పెట్టి మరీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకునేలా చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లెజెండ్స్‌ లీగ్‌లో ఆడుతున్న అక్తర్‌.. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. అసలు కోహ్లికి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనే లేదని, కొందరు బలవంత పెట్టి మరీ అతన్ని తప్పుకునేలా చేశారని సంచలన ఆరోపణలు చేశాడు.  

ఏది ఏమైనప్పటికీ.. కోహ్లి ప్రస్తుతం టీమిండియాలో సాధారణ ఆటగాడిగా కొనసాగాల్సిందేనని, అతను బ్యాటింగ్‌ ఫామ్‌ తిరిగి అందుకోవాలని, లేకపోతే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కోహ్లి ప్రస్తుత తరంలో గొప్ప బ్యాటర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదని, అయినప్పటికీ జట్టులో కొనసాగాలంటే కచ్చితంగా రాణించాల్సిందేనని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా టీమిండియా తదుపరి టెస్ట్‌ కెప్టెన్‌ ఎవరనే అంశంపై మాట్లాడుతూ.. బుమ్రాకు సారధ్య బాధ్యతలు అప్పచెబితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. 

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్‌ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్‌ సిరీస్‌ ఓటమి అనంతరం అతను టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 
చదవండి: జాతీయ గీతాలాపన సందర్భంగా కోహ్లి అనుచిత ప్రవర్తన.. ఫైరవుతున్న ఫ్యాన్స్

మరిన్ని వార్తలు