కోహ్లి పేరిట మరో చెత్త రికార్డు

13 Feb, 2021 13:28 IST|Sakshi

చెన్నై: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేరిట మరోచెత్త రికార్డు నమోదు అయింది. రెండో టెస్టులో భాగంగా కోహ్లి ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ మెయిన్‌ అలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయి డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అలీ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌కు అవతల పడుతూ వెళ్లడంతో కోహ్లి కవర్‌ డ్రైవ్‌ దిశగా షాట్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్‌ తీసుకొని ఆఫ్‌ స్టంఫ్‌ వికెట్‌ను గిరాటేసింది. దీంతో అసలేం జరిగిందో అర్థం కాక కోహ్లి షాక్‌ తిన్నాడు. తన అవుట్‌పై సందేహం వచ్చి కోహ్లి రివ్యూ కోరగా.. అక్కడా నిరాశ ఎదురైంది.

దీంతో తన టెస్టు కెరీర్‌లో కోహ్లి 11వ సారి డకౌట్‌గా వెనుదిరగ్గా.. ఒక స్పిన్నర్‌ బౌలింగ్‌లో డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. అంతకముందు 10 సార్లు కోహ్లి ఫాస్ట్‌ బౌలర్ల చేతిలోనే డకౌట్‌గా వెనుదిరగాడు. రవి రాంపాల్‌, బెన్‌ హిల్పెనాస్‌, లియాన్‌ ఫ్లంకెట్‌, జేమ్స్‌ అండర్సన్‌, మిచెల్‌ స్టార్క్‌, సురంగ లక్మల్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, పాట్‌ కమిన్స్‌, కీమర్‌ రోచ్‌, అబి జావెద్‌లు ఫాస్ట్‌ బౌలర్లు కాగా.. అలీ ఒక్కడే కోహ్లిని డకౌట్‌ చేసిన స్పిన్నర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. అంతేగాక క్లీన్‌బౌల్డ్‌ రూపంలోనే వరుసగా రెండోసారి కోహ్లి డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. కాగా అంతర్జాతీయ కెరీర్‌లో కోహ్లికి మొత్తం 26 డకౌట్‌లున్నాయి. టీమిండియా తరపున టెస్టు కెప్టెన్‌గా ఉంటూ అత్యధికసార్లు డకౌట్‌ అయిన రెండో ఆటగాడిగా కోహ్లి చెత్త రికార్డును నమోదు చేశాడు. తాజా డకౌట్‌తో కోహ్లి ధోనిని అధిగమించగా.. 13 డకౌట్‌లతో సౌరవ్‌ గంగూలీ మొదటి స్థానంలో ఉన్నాడు.
చదవండి: 'కమాన్‌ రోహిత్‌.. యూ కెన్‌ డూ ఇట్‌'

>
మరిన్ని వార్తలు