Virat Kohli: మారని ఆటతీరు.. వన్డే కెరీర్‌లో అత్యంత చెత్త రికార్డు

17 Jul, 2022 21:42 IST|Sakshi

విరాట్‌ కోహ్లి ఫేలవ ఫామ్‌ కొనసాగుతూనే ఉంది. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో బ్యాటింగ్‌లో కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. మూడు ఫోర్లతో మంచి టచ్‌లోనే కనిపించిన కోహ్లి మరోసారి ఆఫ్‌స్టంప్‌ బలహీనతను బయటపెట్టాడు. రీస్‌ టోప్లీ వేసిన గుడ్‌లెంగ్త్‌ డెలివరినీ అంచనా వేయడంలో పొరబడిన కోహ్లి ఫేలవమైన షాట్‌ ఆడి కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 17 పరుగుల వద్ద కోహ్లి కథ ముగిసింది.  

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి వన్డేకు దూరంగా ఉన్న కోహ్లి.. మిగిలిన రెండు వన్డేలు కలిపి 33 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే కోహ్లి తన వన్డే కెరీర్‌లోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. తాను వరుసగా ఆడిన చివరి ఐదు వన్డేల్లో  కోహ్లి చేసిన పరుగులు 8,18,0,16,17. వరుసగా ఐదు వన్డేల్లో 20 పరుగులు ఒక్కసారి కూడా చేయకపోవడం కోహ్లికి ఇదే తొలిసారి. ఇంతకముందు ఎప్పుడు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదు. 

మారని ఆటతీరుతో విసిగిస్తున్నప్పటికి కోహ్లకి అటు అభిమానుల నుంచి.. తోటి ఆటగాళ్ల నుంచి మద్దతు మాత్రం బాగానే ఉంది. ప్రతీ ఒక్క బ్యాటర్‌కు బ్యాడ్‌ఫేజ్‌ ఉండడం సహజం.. కానీ కోహ్లి విషయంలో ఇంకా దారుణంగా ఉంది. కోహ్లి సెంచరీ చేసి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. 71వ సెంచరీ అందుకుంటాడని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులను మరోసారి నిరాశకు గురిచేసిన కోహ్లి.. సెంచరీ మాట పక్కనబెడితే ఫిప్టీ సాధించడానికి కూడా నానా కష్టాలు పడాల్సి వస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో కోహ్లి జట్టుకు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

చదవండి: రోహిత్‌ను కాదని కోహ్లి డైరెక్షన్‌లో సిరాజ్‌ బౌలింగ్‌‌.. ఫలితం!

Liam Livingstone: అక్కడుంది లివింగ్‌స్టోన్‌.. 'కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లోకి బంతి'

మరిన్ని వార్తలు