వీరు విధ్వంసానికి తొమ్మిదేళ్లు

8 Dec, 2020 12:04 IST|Sakshi

ముంబై : వీరేంద్ర సెహ్వాగ్ అంటేనే విధ్వంసానికి పెట్టింది పేరు. బరిలోకి దిగాడంటే చాలు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఫామ్‌లో ఉంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ బౌలర్లను మానసికంగా దెబ్బతీసేవాడు. కాగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అప్పటికే డబుల్‌ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. డబుల్‌ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా సచిన్‌ రికార్డులకెక్కాడు. అప్పటికే వన్డేల్లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడిన సెహ్వాగ్‌ డబుల్‌ సెంచరీపై కన్నేశాడు. (చదవండి : 'తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్నాడు')

ఆరోజు రానే వచ్చింది. డిసెంబర్‌ 8, 2011.. ఇండోర్‌ వేదికగా వెస్టిండీస్‌తో నాలుగో వన్డే.. అప్పటికే టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఏంచుకుంది. సచిన్‌ ఈ టోర్నీకి దూరంగా ఉండడంతో గంభీర్‌తో కలిసి సెహ్వాగ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. సెహ్వాగ్‌ విధ్వంసం సృష్టించబోతున్నాడని పాపం విండీస్‌ ఊహించి ఉండదు. మ్యాచ్‌ తొలి 5 ఓవర్లు నెమ్మ​దిగా సాగిన టీమిండియా బ్యాటింగ్‌ ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఏ బౌలర్‌ను వదలని సెహ్వాగ్‌  ఊచకోత కోశాడు. కొడితే బౌండరీ .. లేదంటే సిక్సర్‌ అనేంతలా వీరు విధ్వంసం కొనసాగింది. కేవలం 149 బంతుల్లోనే 219 పరుగులు చేసిన సెహ్వాగ్‌ తన తొలి డబుల్‌ సెంచరీ.. వన్డే చరిత్రలో రెండో డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సెహ్వాగ్‌ ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

అప్పటివరకు సచిన్‌ పేరిట ఉన్న 200 పరుగులు అత్యధిక స్కోరును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ తర్వాత రోహిత్‌ శర్మ సెహ్వాగ్‌ రికార్డును బ్రేక్‌ చేయడమే కాకుండా వన్డేలో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలా భారత్‌ నుంచి ముగ్గురు క్రికెటర్లు డబుల్‌ సెంచరీ ఫీట్‌ను సాధించడం మరో విశేషంగా చెప్పవచ్చు. కాగా సెహ్వాగ్‌ వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లోనూ రెండు ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలా వన్డేల్లో, టెస్టుల్లో ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన వారిలో సెహ్వాగ్‌ తర్వాత గేల్‌ మాత్రమే ఉన్నాడు. (చదవండి : మీరే కాదు.. నేనూ మిస్సవుతున్నా : కోహ్లి)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు