Virender Sehwag: 374 మ్యాచ్‌లు.. 17253 పరుగులు..

20 Oct, 2021 12:43 IST|Sakshi

Happy Birthday Virender Sehwag: డాషింగ్‌ ఓపెనర్‌... బౌలర్లకు చుక్కలు చూపే విధ్వంసకర బ్యాటర్‌... రికార్డులకు చేరువలో ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం రిస్క్‌ చేసేందుకైనా వెనుకాడని ధీరుడు.. ప్రేక్షకులను అలరించడమే ముందుకు సాగే అసలు సిసలు క్రికెటర్‌... ‘నవాబ్ ఆఫ్ నజాఫ్‌గఢ్’ వీరేంద్ర సెహ్వాగ్‌ పుట్టినరోజు నేడు. బుధవారంతో ఈ లెజెండ్‌ 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. 

ఈ సందర్భంగా బీసీసీఐ సెహ్వాగ్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ‘‘374 అంతర్జాతీయ మ్యాచ్‌లు. 17253 పరుగులు. టెస్టుల్లో రెండు ట్రిపుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక టీమిండియా క్రికెటర్‌. వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌. 2007 వరల్డ్‌ టీ20, 2011 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు’’ అంటూ అతడి ఘనతను కీర్తిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 

అప్పటి నుంచి రెగ్యులర్‌ బ్యాటర్‌గా..
1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి వీరూ భాయ్‌... తొలినాళ్లలో అంతగా రాణించలేకపోయాడు. పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో ఒక్క పరుగుకే పెవిలియన్‌ చేరాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాణించడం, 2001 న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలో దిగి సెంచరీ చేయడంతో వీరూ కెరీర్‌ మలుపు తిరిగింది. అప్పటి నుంచి జట్టులో రెగ్యులర్‌ బ్యాట్స్‌మెన్‌గా అతడు కొనసాగాడు.

ఇక 2003 వన్డే వరల్డ్‌కప్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌ ఇన్నింగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ(360) లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. 10 ఫోర్లు..3 సిక్పర్లతో వీరూ చెలరేగిన విధానం అందరికీ గుర్తుండే ఉంటుంది. 

ట్రిపుల్‌ సెంచరీ.. ముల్తాన్‌ కా సుల్తాన్‌..
పాక్‌ పర్యటనలో భాగంగా 2004లో ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్‌ ట్రిపుల్‌ సెంచరీ సాధించాడు. సిక్సర్‌ బాది మరీ త్రిశతకం పూర్తి చేసుకోవడం విశేషం.

కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు సెహ్వాగ్‌ వీడ్కోలు పలికాడు.

సెహ్వాగ్‌ గురించిన విశేషాలు క్లుప్తంగా...
1978, అక్టోబరు 20న ఢిల్లీలో జననం
1999లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం
2001లో టెస్టుల్లో అడుగుపెట్టిన సెహ్వాగ్‌
2006లో టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం
టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌గా గుర్తింపు
టెస్టుల్లో రెండు ట్రిపుల్‌ సెంచరీలు చేసిన ఏకైక టీమిండియా క్రికెటర్‌
సిక్సర్‌తో త్రిశతకం పూర్తిచేసుకున్న క్రికెటర్‌గా రికార్డు
2007 టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడు
వన్డేల్లో డబుల్‌ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌
వన్డేల్లో సెహ్వాగ్‌ అత్యధిక స్కోరు 219
టెస్టుల్లో అత్యధిక స్కోరు 319
2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
చదవండి: టెస్ట్‌ క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ గుడ్‌బై...

మరిన్ని వార్తలు