'ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కేందుకు నేను సిద్ధం'

12 Jan, 2021 19:10 IST|Sakshi

సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాలపాలవుతున్న సంగతి తెలిసిందే. గాయాలతో ఇప్పటికే మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌లు దూరమవగా.. తాజాగా జరిగిన మూడో టెస్టులో రవీంద్ర జడేజా, హనుమ విహారీలు కూడా గాయపడడం.. చివరకు టీమిండియా ప్రధాన అస్త్రం జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా గాయంతో నాలుగో టెస్టుకు దూరం కావడంతో సగం జట్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్‌ సిరీస్‌లో గాయపడిన ఆరుగురు ఆటగాళ్ల ఫోటోలను షేర్‌ చేస్తూ ఫన్నీ కామెంట్స్‌ పెట్టాడు.(చదవండి: మీ ఆటకు ఫిదా.. అవేవి మిమ్మల్ని ఆపలేదు)

'ఆసీస్‌ సిరీస్‌లో టీమిండియా గాయాలతో సతమతమవడం నేను చూడలేకపోతున్నా. షమీ, ఉమేశ్‌, రాహుల్‌, జడేజా, విహారి, బుమ్రా ఇలా ఒకరి తర్వాత ఒకరు గాయపడడంతో సగం జట్టు ఖాళీ అయింది. ఒకవేళ 11 మందిలో ఇంకా ఎవరు ఫిట్‌గా లేకున్నా వారి స్థానంలో నేను ఆడేందుకు సిద్ధంగా ఉన్నా..ఇప్పుడే ఆస్ట్రేలియా ఫ్లైట్‌ ఎక్కేందుకు నేను సిద్దం.. కానీ బీసీసీఐ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందేమో' అంటూ ఫన్నీ ట్వీట్‌ చేశాడు.(చదవండి: బుమ్రా ఔట్‌.. డైలమాలో టీమిండియా)


మరోవైపు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఆసీస్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు దూరమైనట్లు మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. పొత్తి కడుపు నొప్పి కారణంగా బుమ్రా సిరీస్‌లో మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో భారత క్రికెట్‌ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతుంది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై బుమ్రా ఆడకపోవడం జట్టును కలవరపరుస్తోంది. ఒకవైపు టీమిండియా డైలమాలో ఉన్నా సైనీ, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌లు కూడా పేస్‌ బౌలింగ్‌లో ఇప్పటికే నిరూపించుకోవడంతో కాస్త ధైర్యంగా ఉంది. జడేజా స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా స్థానంలో నటరాజన్‌లు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. బుమ్రా గైర్హాజరీలో సైనీ బౌలింగ్‌ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. కాగా ఇరుజట్ల మధ్య జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌ వేదికగా చివరి టెస్టు మ్యాచ్‌ జరగనుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు