Sehwag T20 Team: ఆ యువ ఆల్‌రౌండర్‌కు అనూహ్యంగా చోటు

28 Jul, 2021 18:30 IST|Sakshi

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్లు తుది జట్టు ఆటగాళ్ల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు విశ్లేషకులు, మాజీలు సైతం తుది జట్టులో ఉండబోయే ఆటగాళ్లపై తమతమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం​ ప్రపంచకప్‌ బరిలో దిగే భారత తుది జట్టును అంచనా వేశాడు. శ్రీలంక పర్యటనలో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించిన వీరూ.. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్‌, శ్రేయస్ అయ్యర్‌లను విస్మరించాడు.

తన జట్టులో ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ఎంపిక చేసిన వీరేంద్రుడు.. వన్‌ డౌన్ బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్‌కు అవకాశమిచ్చారు. నాలుగో స్థానంలో విధ్వంసకర వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను.. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశాడు. అయితే ఆల్‌రౌండర్ల ఎంపిక విషయంలో వీరూ తన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఈ కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను స్థానం కల్పించిన ఆయన.. అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను కూడా ఎంపిక చేశాడు. 

ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా నిరాశపరుస్తున్నా.. అతని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం కారణంగానే తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని తెలిపాడు. ఇక జడ్డూ అసలుసిసలైన ఆల్‌రౌండరని, సుందర్ కారణంగా బౌలింగ్‌ డెప్త్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాడు. కాగా, స్పెషెలిస్ట్‌ స్పిన్నర్‌ కోటాలో వీరూ.. కేవలం చహల్‌కు మాత్రమే చోటు దక్కుతుందన్నాడు. బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు ప్రధాన పేసర్లుగా ఉంటారని అంచనా వేశాడు. ఇటీవలకాలంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న దీపక్ చాహర్‌ను సైతం వీరేంద్రుడు విస్మరించడం విశేషం.

సెహ్వాగ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్

మరిన్ని వార్తలు