ఓ మైలురాయి అందుకోకుండా కోహ్లి నన్ను అడ్డుకున్నాడు.. సెహ్వాగ్‌ సంచలన కామెంట్స్‌

25 Mar, 2023 17:38 IST|Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లిపై డాషింగ్‌ ఆటగాడు, భారత మాజీ ప్లేయర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన కామెంట్స్‌ చేశాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో వీరూ మాట్లాడుతూ.. తాము కలిసి ఆడే రోజుల్లో విరాట్‌ కోహ్లి తనను ఓ మైలురాయిని అందుకోకుండా అడ్డుకున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్‌లో ఓ భారీ రికార్డు అందుకునే క్రమంలో కోహ్లి ఓ క్యాచ్‌ డ్రాప్‌ చేసి తన  పేరిట రికార్డు నమోదు కాకుండా చేశాడని ఫీలయ్యాడు.

ఆ సమయంలో పట్టలేనంత కోపం వచ్చి కోహ్లిపై గట్టిగా అరిచానని, తాను ట్రిపుల్‌ సెంచరీ మిస్‌ అయినప్పుడు కూడా అంతలా ఫీలవ్వలేదని చెప్పుకొచ్చాడు. అప్పట్లో కోహ్లిని అందరూ పెద్ద స్టార్‌ ఆవుతాడని అనేవారని, తాను మాత్రం ఆ విషయంతో ఏ​కీభవించలేదని తెలిపాడు.  అయితే శ్రీలంకపై ఓ మ్యాచ్‌లో కోహ్లి అద్భుతమైన సెంచరీ చేశాక, తనతో పాటు చాలామంది అభిప్రాయాలు మారాయని పేర్కొన్నాడు.

కెరీర్‌ ఆరంభంలో కోహ్లి 75 సెంచరీలు చేస్తాడని ఎవరూ ఊహించలేదని, అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ కోహ్లి వంద అంతర్జాతీయ సెంచరీల దిశగా దూసుకుపోవడం అందరి కంటే తనకే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని అన్నాడు. కోహ్లి తన నిలకడైన ఆటతీరుతో తనతో పాటు చాలామందిని రాంగ్‌గా ప్రూవ్‌ చేశాడని, భవిష్యత్తులో అతను సచిన్‌ 100 సెంచరీల రికార్డును తప్పక అధిగమిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా, 44 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్‌ విధ్వంసకర బ్యాటర్‌గానే కాకుండా అద్భుతమైన పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గానూ సేవలందించాడు. అతని జమానాలో వీరూ.. పాంటింగ్‌, గిల్‌క్రిస్ట్‌, హేడెన్‌, హస్సీ, సంగక్కర, జయవర్ధనే, దిల్షన్‌, లారా లాంటి హేమాహేమీలను బోల్తా కొట్టించాడు. టెస్ట్‌ల్లో 40 వికెట్లు పడగొట్టిన వీరూ.. వన్డేల్లో 96 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

మరిన్ని వార్తలు