Virender Sehwag: నెంబర్‌ షేర్‌ చేసిన సెహ్వాగ్‌; దీని వెనుక ఇంత కథ ఉందా

3 Aug, 2021 21:18 IST|Sakshi

ఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్‌.. క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. తన డాషింగ్‌ బ్యాటింగ్‌తో టీమిండియా తరపున ఎన్నోసార్లు అద్భుతాలు సృష్టించిన సెహ్వాగ్‌ ఆటకు రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌ అయ్యాడు. తాజాగా సెహ్వాగ్‌ తన ట్విటర్‌లో ఒక ఆసక్తికర పోస్టును షేర్‌ చేశాడు. స్నానం చేస్తుంటే నా ఫోన్‌ షవర్‌లో పడిపోయింది. దానిని రిపేర్‌కు ఇచ్చా.. ఈ నెంబర్‌కు కాల్‌ చేయండి అంటూ 9112083319 నెంబర్‌ను షేర్‌ చేశాడు. ఇంకేముంది.. సెలబ్రిటీల ఫోన్‌ నెంబర్లు దొరకడమే అదృష్టంగా భావించే నెటిజన్లు.. సెహ్వాగ్‌ లాంటి క్రికెటర్‌ నెంబర్‌ ఇస్తే ఊరుకుంటారా.. వెంటనే ఆ నెంబర్‌కు కాల్‌ చేశారు. అక్కడే నెటిజన్లకు ఊహించని షాక్‌ తగిలింది. ఆ నంబర్‌కు ఎన్నిసార్లు కాల్‌ చేసినా నాట్‌ రీచబుల్‌ అని వచ్చింది. దీంతో నెటిజన్లు సెహ్వాగ్‌ మమ్మల్ని ఫూల్స్‌ చేశాడని భావించారు.

కానీ సెహ్వాగ్‌ ఆ నెంబర్‌ పెట్టడం వెనుక ఒక చరిత్ర దాగుంది. అదేంటంటే ఆ నెంబర్‌ను విడదీసి చూస్తే సెహ్వాగ్‌ రికార్డులు కనిపిస్తాయి. ముందుగా 91 నెంబర్‌ను గమనిస్తే.. సెహ్వాగ్‌ టెస్టుల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య... 120 అనేది సెహ్వాగ్‌కు ఐపీఎల్‌లో అత్యుత్తమ స్కోరు(122 సెహ్వాగ్‌ అత్యధిక స్కోరు.. దానికి దగ్గరగా).. ఇక మధ్యలో ఉన్న 83... 2008లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెహ్వాగ్ చేసిన పరుగులు. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట నాలుగో రోజు ఆఖరి సెషన్‌లో 68 బంతుల్లో 83 చేసిన వీరేంద్ర సెహ్వాగ్, భారత జట్టుకి అద్వితీయ విజయాన్ని అందించాడు. ఇక చివరగా 319.. అనేది టెస్టుల్లో సెహ్వాగ్‌ అత్యధిక స్కోరుతో పాటు ట్రిపుల్‌ సెంచరీ. 2007-08లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సెహ్వాగ్‌ ఈ స్కోరు సాధించాడు. ఇక టీమిండియా తరపున సెహ్వాగ్‌ 251 వన్డేల్లో 8273 పరుగులు, 104 టెస్టుల్లో 8586 పరుగులు, 19 టీ20ల్లో 394 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు