పాటలు పాడుతూనే ‘వీర’బాదుడు!

17 Apr, 2021 18:08 IST|Sakshi
Photo Courtesy:IANS/Twitter

న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్‌.. పెద్దగా పరిచయం అక్కర్లేని భారత క్రికెటర్‌. ఫీల్డ్‌లో దిగితే బ్యాటింగ్‌ మోత మోగించే వీరేంద్ర సెహ్వాగ్‌.. మంచి ఎంటర్‌టైనర్‌ కూడా. క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత సెహ్వాగ్‌.. సోషల్‌ మీడియాలో సెటైరిక్‌‌ పోస్ట్‌లు పెడుతూ అభిమానుల్ని ఎక్కువగా అలరిస్తూ ఉంటున్నాడు..సెహ్వాగ్‌ ఏది పోస్ట్‌ చేసినా అందులో హాస్య చతురతను ప్రదర్శించడం అతనికి హాబీ.  కాగా,  గతంలో సెహ్వాగ్‌ క్రికెట్‌ మైదానంలో దిగినప్పుడు కూడా సరదాగా ఉండేవాడట. ఎటువంటి టెన్షన్‌ పడకుండా బ్యాట్‌ను ఝుళిపించే సెహ్వాగ్‌.. పాటలు పాడుతూ బ్యాటింగ్‌ చేసిన సందర్భాలు ఎన్నో,   అవి వికెట్ల వెనుకాల ఉండే స్టంప్స్‌ మైక్‌లో రికార్డయ్యేవి. ఆనాటి ఒక సంఘటనను టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో షేర్‌ చేసుకున్నాడు సెహ్వాగ్‌. 

ఇటీవల సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యాతగా నిర్వహించిన ‘దాదాగిరి’ షోలో సెహ్వాగ్‌ గత జ‍్క్షాపకాల్ని నెమరవేసుకున్నాడు. ప్రధానంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భాగంగా  ముల్తాన్‌ టెస్టులో ట్రిపుల్‌ సెంచరీ సాధించినప్పడు, బెంగళూరులో 201 పరుగులు చేసినప్పుడు, లాహోర్‌లో 154 పరుగులు చేసిన సందర్భాల్లో హిందీ పాటలు పాడుతూనే బ్యాటింగ్‌ చేసిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో కమ్రాన్‌ అక్మల్‌ వికెట్ల వెనకాల ఉంటూ తన పాటల్ని ఆస్వాదించేవాడన్నాడు.  ఒకానొక సందర్భంలో భారత లెజెండ్‌ సింగర్‌ కిషోర్‌ కుమార్‌ పాడిన పాటను అక్మల్‌ ప్రత్యేకంగా అడిగి మరీ పాడించుకున్నాడన్నాడు.   

కాగా, ఇక్కడ సెహ్వాగ్‌ పాట పాడుతూ దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్‌ అలెన్‌ డొనాల్డ్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన విషయాన్ని గంగూలీ గుర్తుచేశాడు. 2015లో ఆల్‌ స్టార్స్‌ లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో డొనాల్డ్‌ లెగ్‌ సైడ్‌ వేసిన బంతిని సిక్స్‌గా కొట్టినప్పుడు సెహ్వాగ్‌ ఒక పాట పాడుకుంటూ ఉన్నాడన్నాడు. పాకిస్తాన్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ అతిఫ్‌ ఆస్లామ్‌ సాంగ్‌ అయిన ‘తు జానా నా’ పాటను సెహ్వాగ్‌ అప్పుడు పాడుతున్నాడని గంగూలీ తెరపై చూపించి మరీ వినిపించాడు. 

ఇక్కడ చదవండి: నన్ను చంపాలనే ప్రోగ్రామ్‌ పెట్టారా..?: రోహిత్‌‌
సాహోరే చహర్‌ బ్రదర్స్‌.. ఇద్దరూ సేమ్‌ టూ సేమ్‌‌‌‌‌

మరిన్ని వార్తలు