Virendra Sehwag: ఆట ఏదైనా ఒక్కటే.. అంపైర్ల చీటింగ్‌ మాత్రం మారదు

6 Aug, 2022 13:56 IST|Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు శుక్రవారం ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన సెమీఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పెనాల్టీ షూటౌట్‌లో భాగంగా ఆసీస్‌ చేతిలో భారత్‌ 3-0తో పరాజయం చవిచూసింది. అయితే పెనాల్టీ షూటౌట్‌ ప్రారంభానికి జరిగిన ఒక చిన్న తప్పిదం భారత మహిళలను ఓటమి వైపు నడిపించింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్‌ ముగిసే సమయానికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది.

ఆస్ట్రేలియా డిపెండర్‌ అంబ్రోషియా మలోనే షూటౌట్‌కు సిద్దమైంది. ఆమె షాట్‌ ఆడగా.. భారత గోల్‌కీపర్‌ సవితా అడ్డుకుంది. అలా ఆసీస్‌ ఒక పెనాల్టీ వృథా చేసుకుందని మనం సంతోషించేలోపే అంపైర్‌ మధ్యలో దూరింది. సారీ.. షూటౌట్‌ క్లాక్‌ టైంలో తప్పిదం ఉందని.. మళ్లీ ప్రారంభించాలని చెప్పింది. అప్పటికే షూటౌట్‌ చేయడానికి వచ్చిన భారత క్రీడాకారిణికి విషయం చెప్పి అక్కడి నుంచి పంపించేసి మల్లీ అంబ్రోషియాను పిలిచింది. తొలిసారి మిస్‌ అయిన అంబ్రోషియా ఈసారి మాత్రం గురి తప్పలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్‌ కొట్టగా.. భారత్‌ మాత్రం​ఒక్క గోల్‌ చేయలేకపోయింది. అలా భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌ చేరడంలో విఫలమైంది.

అయితే పెనాల్టీ షూటౌట్‌ సమయంలో అంపైర్‌ విధానంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆడుతున్నది ఒక సెమీఫైనల్‌ మ్యాచ్‌ అని మరిచిపోయి.. క్లాక్‌టైం మిస్టేక్‌ అని చెప్పడం సిల్లీగా ఉందని.. అంపైర్‌ కావాలనే ఇలా చేసిందేమో అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే విషయమే టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా అంపైర్‌ తీరుపై ఘాటుగా స్పందించాడు.

''ఆస్ట్రేలియాకు పెనాల్టీ మిస్‌ కాగానే అంపైర్‌ పరిగెత్తుకొచ్చి.. సారీ క్లాక్‌ ఇంకా స్టార్ట్‌ చెయ్యలేదు.. మళ్లీ ఆరంభిద్దామా అని సింపుల్‌గా చెప్పేసింది. అంపైర్లు ఇలా ఎందుకుంటారో అర్థం కావడం లేదు. క్రికెట్‌.. హాకీ ఇలా ఏదైనా ఒక్కటే.. అంపైర్లు తమకుండే సూపర్‌ పవర్‌తో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు. ఇలాంటివి క్రికెట్‌లో బాగా జరిగేవి.. అందుకే మేం హాకీలోకి కూడా త్వరలోనే ఎంటరవుతాం.. అమ్మాయిలు.. ఓడిపోయారు పర్లేదు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

మరోవైపు భారత్‌- ఆస్ట్రేలియా వుమెన్స్‌ మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్‌పై విమర్శలు పెరగడంతో అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్‌ కూడా స్పందించింది. ''కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌- ఆస్ట్రేలియా సెమీఫైనల్లో షూటౌట్‌ చిన్న తప్పిదం వల్ల క్లాక్‌ సెట్‌ చేయకముందే ప్రారంభమయింది. అందుకే మళ్లీ ప్రారంభించాం. ఈ తప్పిదానికి మేం క్షమించమని కోరుతున్నాం. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతాం.'' అని కామెంట్‌ చేసింది.

కాగా సెమీస్‌లో ఓడినప్పటికి భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమవనుంది. మరో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌పై 2-0 తేడాతో విజయం సాధించి ఫైనల్‌ పోరుకు అర్హత సాధించింది. ఇక కాంస్య పతక పోరులో భాగంగా ఆదివారం భారత్‌, న్యూజిలాండ్‌ మహిళల జట్లు పోటీ పడనున్నాయి.

చదవండి: 'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్‌' ప్రశంసలు

మరిన్ని వార్తలు