Virender Sehwag: ‘ప్రతీకారం’ అంటూ పాక్‌ కామెంటేటర్‌ పైత్యం.. అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన సెహ్వాగ్‌! నెహ్రా ఇప్పుడు..

11 Aug, 2022 12:26 IST|Sakshi
వీరేంద్ర సెహ్వాగ్‌- పాక్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌

“Ashish Nehra is right now preparing for UK Prime Minister Elections”: టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సోషల్‌ మీడియాలో ఎంత చలాకీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విషయం ఏదైనా తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తాడు. తాజాగా మరోసారి వీరూ భాయ్‌.. పాకిస్తాన్‌ పొలిటికల్‌ కామెంటేటర్‌ జైద్‌ హమీద్‌ను దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచాడు. క్రీడాకారుల పేర్లు వాడుకుని విద్వేష విషం చిమ్మాలనుకున్న హమీద్‌కు అదిరిపోయే రీతిలో కౌంటర్‌ ఇచ్చాడు.

కనీస అవగాహన లేని అతడి విషయపరిజ్ఞానాన్ని ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయమేమింటే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా గాయం కారణంగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022కు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్‌ అథ్లెట్‌ అర్షద్‌ నదీమ్‌ ఈ విభాగంలో పసిడి పతకం సాధించాడు.

అంతకు ముందు జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నీరజ్‌ రతజం సాధించగా.. నదీం నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తాజాగా కామన్‌వెల్త్‌ క్రీడల్లో నీరజ్‌ గైర్హాజరీలో అతడు ఏకంగా పసిడి పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో జైద్‌ హమీద్‌ ట్విటర్‌​ వేదికగా తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ‘‘ఈ విజయం మరింత మధురమైనదిగా ఎందుకు మారిందంటే.. ఈ పాకిస్తానీ అథ్లెట్‌ ఇండియన్‌ జావెలిన్‌ త్రో హీరో ఆశిష్‌ నెహ్రాను ఓడించాడు.

గతంలో ఆశిష్‌.. అర్షద్‌ నదీమ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే కదా! మరి ఇప్పుడు అతడు ప్రతీకారం తీర్చుకున్నాడు’’ అని ట్వీట్‌ చేశాడు. నీరజ్‌ చోప్రా బదులు మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రా పేరు వాడాడు. అంతేకాదు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో నీరజ్‌ పాల్గొనకపోయినా అతడిని పాక్‌ అథ్లెట్‌ ఓడించాడంటూ ప్రగల్భాలు పలికాడు. ఈ ట్వీట్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కంటపడింది.

‘‘చిచ్చా.. ఆశిష్‌ నెహ్రా ఇప్పుడు..
ఇంకేముంది! వీరూ భాయ్‌ తనదైన స్టైల్లో హమీద్‌కు చురకలు అంటించాడు. ‘‘చిచ్చా.. ఆశిష్‌ నెహ్రా ఇప్పుడు యూకే ప్రధాన మంత్రి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాడు. నువ్వు కాస్త చిల్‌ అవ్వు’’ అంటూ సెటైర్‌ వేశాడు. అయితే, చాలా మంది నెటిజన్లు ఇందుకు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొంత మంది మాత్రం మనకు ఇవన్నీ అవసరమా అంటూ పెదవి విరుస్తున్నారు.

తప్పులు అందరూ చేస్తారంటూ సెహ్వాగ్‌ ఇటీవల హిమదాస్‌కు శుభాకాంక్షలు చెప్పిన ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ను రీషేర్‌ చేస్తున్నారు. అదే విధంగా నీరజ్‌ చోప్రా, నదీమ్‌ సోదరభావంతో పరస్పరం ఒకరినొకరు అభినందించుకుంటూ ముందుకు సాగుతున్నారని.. హమీద్‌ లాంటి వాళ్లు మాత్రం విషం చిమ్మాలని చూస్తున్నారంటూ అతడిని విమర్శిస్తున్నారు.
చదవండి: Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్‌ హీరోయిన్‌కు పంత్‌ దిమ్మతిరిగే కౌంటర్‌

మరిన్ని వార్తలు