వారిద్దరి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా..

6 Oct, 2020 18:12 IST|Sakshi

ముంబై : భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లైన జయ్‌దేవ్‌ ఉనాద్కట్‌, రాబిన్‌ ఊతప్పలను తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. కోట్టు పెట్టి వారిద్దరిని కొన్నందుకు రాజస్తాన్‌కు ఏమైనా ఉపయోగం ఉందా అంటూ చురకలంటించాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ 'వీరు కీ బైతక్‌' పేరుతో ఒక చానెల్‌ ఓపెన్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌  13వ సీజన్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలను తన చానెల్‌ ద్వారా రోజువారి ఎపిసోడ్లుగా రూపొందించి విడుదల చేస్తున్నాడు. వీరు ప్రారంభించిన ఈ న్యూ సిరీస్‌కు బాగా క్రేజ్‌ వచ్చింది. (చదవండి : ఎంఎస్‌ ధోని ఫన్నీ వాక్‌)

తాజాగా  నేడు(మంగళవారం) అబుదాబి వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ వరుసగా రెండు ఓటములతో ఒత్తిడిలో ఉంటే మరోవైపు ముంబై వరుస విజయాలతో జోరుమీద ఉంది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ జట్టులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వీరు విమర్శించాడు. ' రాజస్తాన్‌ జట్టు తమ ఆటగాళ్లలో కొందరికి అత్యధిక ధరను ఇచ్చి చాలా తప్పులు చేస్తుంది. అందులో ఉనాద్కట్‌ ఒకడు.. ఈ సీజన్‌లో ఉనాద్కట్‌ చెత్త ఫామ్‌ను కొనసాగిస్తూ నాలుగు మ్యాచ్‌లాడి కేవలం ఒక వికెట్‌ మాత్రమే తీశాడు. ఉనాద్కట్‌ను మొదట 2018లో రాజస్తాన్‌ జట్టే రూ .11.5 కోట్లకు కొనుగోలు చేసింది.. ఆ తర్వాత అదే జట్టు మళ్లీ రూ. 8.5 కోట్లకు దక్కించుకుంది.. 2020లో వేలంలోకి వచ్చిన ఉనాద్కట్‌ను మళ్లీ అదే ఆర్‌ఆర్‌ రూ. 3 కోట్లకు దక్కించుకుంది.

ఈ స్కీమ్‌ చూడడానికి బాగుంది కానీ.. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వచ్చేసారి వేలంలో ఉనాద్కట్‌ను కొనుగోలు చేయాలంటే రాజస్తాన్‌కే అతను తిరిగి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందేమో అంటూ చురకలంటించాడు. ఇక మరొక ఆటగాడు రాబిన్‌ ఊతప్ప.. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 33 పరుగులే చేసిన ఊతప్ప జట్టుకు భారంగా మారాడు. రాజస్తాన్‌ అతన్ని రూ. 3కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇక ఊతప్ప పరిస్థితి ఎలా ఉందంటే.. బులెట్‌ కొందామని రాజస్తాన్‌ రాయల్స్‌ మార్కెట్‌(ఐపీఎల్‌ వేలం)లోకి వెళితే బులెట్‌కు బుదులు లూనాను కొనుగోలు చేసినట్లు తయారైంది. కోట్టు పెట్టి కొంటే వీరివల్ల జట్టుకు ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి 'అంటూ విమర్శించాడు. అయితే ముంబై ఇండియన్స్‌తో జరగనున్న నేటి మ్యాచ్‌లో రాజస్తాన్‌ కొంచెం ఆధిక్యంలో ఉంది.. అది ఎలా అంటారా.. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఆర్‌ఆర్‌ ముంబైపై పైచేయి సాధించింది అని చెప్పుకొచ్చాడు. (చదవండి : ధోనిలో ఉన్న గ్రేట్‌నెస్‌ అదే!)

Dilli Ki Nikal Padi. Catch the fresh episode of 'Viru Ki Baithak' every morning only on Facebook Watch #CricketTogether

A post shared by Virender Sehwag (@virendersehwag) on

ఇక ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌ఆర్‌ జట్టు ఆరంభంలో జరిగిన రెండు మ్యాచ్‌లను భారీ విజయాలుగా మలిచినా.. తర్వాతి రెండు మ్యాచ్‌లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. స్టీవ్‌ స్మిత్‌, సంజూ శామ్సన్‌ తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. స్మిత్‌, శామ్సన్‌ విఫలమైతే ఆ జట్టును ఆదుకునేవారు కరువయ్యారు. ముంబై విషయానికి వస్తే ఆరంభ మ్యాచ్‌లో చతికిలపడి తర్వాత మూడు విజయాలు అందుకొని టాప్‌2 లో నిలిచి నూతన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు