పాండ్యా విషయంలో ఆ లాజిక్‌ ఎలా మిస్సయ్యాడు: సెహ్వాగ్‌

28 Mar, 2021 11:22 IST|Sakshi

పుణే: ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హార్దిక్‌ పాండ్యాకు బౌలింగ్‌ ఇవ్వకపోవడంపై కోహ్లి చెప్పిన కారణాన్ని మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ తప్పుబట్టాడు. హర్దిక్‌కు శారీరక శ్రమ కల్పించొద్దనే అతనికి బౌలింగ్‌ అవకాశం ఇ‍వ్వడం లేదని కోహ్లి చెప్పిన సమాధానంపై వీరు పెదవి విరిచాడు. మూడో వన్డే నేపథ్యంలో సెహ్వాగ్‌ కోహ్లి వ్యాఖ్యలపై స్పందించాడడు. ''హర్దిక్‌ పాండ్యా విషయంలో కోహ్లి తప్పు చేస్తున్నాడు. వన్డే మ్యాచ్‌ అంటే 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో తుది జట్టులో ఉండే 11 మంది ఆటగాళ్లకు ఎలాంటి మినహాయింపు ఉండదు. అలాంటిది హార్దిక్‌ అన్ని ఓవర్ల పాటు మైదానంలో ఉండి ఫీల్డింగ్‌ చేసినా అది శారీరక శ్రమ కిందికి వస్తుంది.. మరి అలాంటప్పుడు పాండ్యా మొత్తం కోటా ఓవర్లు వేయకున్నా.. నాలుగు ఓవర్లు వేసినా అతనిపై పనిభారం పడదు.


కానీ కోహ్లి మాత్రం అతనికి పనిభారం తప్పించేందుకే ఇలా చేస్తున్నాం అని చెప్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌, ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ దృష్టిలో పెట్టుకొని హార్దిక్‌ను బౌలింగ్‌కు దూరంగా ఉంచామని  మరో కారణాన్ని చెప్పాడు. దీనిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. టీ20 మ్యాచ్‌లో ఒక బౌలర్‌ కోటా 4 ఓవర్లు.. చూస్తుండగానే బౌలర్‌ కోటా పూర్తవుతుంది. అలాగే వన్డేల్లో కూడా హార్దిక్‌తో పూర్తి ఓవర్లు వేయించకుండా ఓవర్‌ చేంజింగ్‌ కింద నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేయిస్తే సరిపోయేది. ఈ చిన్న లాజిక్‌ను కోహ్లి ఎలా మిస్పయ్యాడనేది అర్థం కావడం లేదు. అలా కాకుండా వన్డేల్లో హార్దిక్‌ను బ్యాట్స్‌మన్‌గా చూడాలనుకుంటే ఆల్‌రౌండర్‌ ట్యాగ్‌ తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం.


అంతకముందు అదే ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హార్దిక్‌ 5 నుంచి 6 ఓవర్లు వేశాడనే విషయం కోహ్లి పూర్తిగా మరిచిపోయి వర్క్‌ లోడ్‌ అనే కొత్త మాటలు చెప్పుకొచ్చాడు. రెండో వన్డేలో హార్దిక్‌ బౌలింగ్‌ ఇచ్చి ఉండి.. ఒకవేళ అతను కీలక వికెట్లు తీసుకొని ఉంటే అప్పుడు కూడా కోహ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడా అన్న అనుమానం కలుగుతుంది. పాండ్యా సర్జరీ తర్వాత ఐపీఎల్‌ 2020లో బరిలోకి దిగి బౌలింగ్‌ చేశాడు. ఆ తర్వాత ​కూడా పాండ్యా నాన్‌స్టాప్‌ క్రికెట్‌ ఆడలేదు. ఆసీస్‌, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ల్లో కేవలం టీ20, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. పాండ్యా విషయంలో కోహ్లి వ్యాఖ్యలు అర్థ రహితం''. అంటూ తెలిపాడు. 
చదవండి:
హార్దిక్‌కు బౌలింగ్‌ ఇవ్వకపోవడానికి కారణం అదే.. : కోహ్లి
అప్పుడు కృనాల్,‌ టామ్‌.. ఇప్పుడు హార్దిక్‌, సామ్

>
మరిన్ని వార్తలు