అలలపై ఆట.. పతకాల వేట..

9 May, 2022 20:15 IST|Sakshi

విశాఖలో జాతీయ సీ కయాకింగ్‌ చాంపియన్‌ షిప్‌

జూన్‌ 24 నుంచి 3 రోజులు పోటీలు

సాక్షి, విశాఖపట్నం: విశ్వనగరి విశాఖపట్నం.. అరుదైన క్రీడాపోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతోంది. సముద్రంలో అలలతో పోటీపడుతూ.. పడవలపై లక్ష్యంవైపు దూసుకెళ్లే జాతీయస్థాయి క్రీడాపోటీలకు వేదికగా మారుతోంది. జూన్‌ 24 నుంచి 26 వరకు రుషికొండలో జాతీయస్థాయి సీ కయాకింగ్‌ చాంపియన్‌షిప్‌–2022 నిర్వహించనున్నారు. ఈ పోటీలను దేశంలో రెండోసారి, రాష్ట్రంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు.

సీనియర్‌ నేషనల్‌ మెన్స్‌ అండ్‌ ఉమెన్‌ చాంపియన్‌ షిప్‌ని విశాఖలో నిర్వహించాలని న్యూఢిల్లీకి చెందిన బృందం నిర్ణయించింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 20 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కయాకింగ్‌ అండ్‌ కనోయింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడల నిర్వహణతో విశాఖ దేశంలోని అగ్రశ్రేణి వాటర్‌ స్పోర్ట్స్‌ డెస్టినేషన్‌లలో ఒకటిగా నిలిచిపోనుంది.

ప్రపంచం చూపు.. కయాకింగ్‌ వైపు..
కయాకింగ్, కానోయింగ్‌ వాటర్‌స్పోర్ట్స్‌కు దాదాపు అన్ని దేశాల్లోనూ మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ పోటీలు ఎక్కడ జరిగినా ప్రపంచం నలుమూలల నుంచి పోటీదారులు హాజరవుతుంటారు. సముద్రంలో అలలను చీల్చుకుంటూ.. ప్రత్యేకమైన నావలో గమ్యాన్ని చేరుకునేందుకు డైవర్లు పోటీ పడుతుంటారు. ఇటీవల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వినోద క్రీడల్లో కయాకింగ్‌ అగ్ర భాగంలో ఉంది. ఇలాంటి క్రీడల్ని నిర్వహించే సామర్థ్యం ఉన్న బీచ్‌లు దేశంలో అతి తక్కువగా ఉన్నా యి. అందులో విశాఖ తీరంలోను పోటీలకు అను వైన వాతావరణం ఉండటంతో రాష్ట్రంలో మొదటి సారి కయాకింగ్‌ పోటీలు జరగబోతున్నాయి.  

మరిన్ని వార్తలు