Skating: అన్న.. చెల్లి.. అదుర్స్‌ .. జాతీయ స్థాయిలో పతకాల పంట

24 Jun, 2022 16:43 IST|Sakshi

స్కేటింగ్‌లో రాణిస్తున్న సాకేత్, సాహితి 

జాతీయ స్థాయిలో పతకాల పంట

అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధం 

కొమ్మాది(భీమిలి)/ విశాఖపట్నం: పోటీకి దిగితే ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించి పతకం సాధించడమే వారి లక్ష్యం. విజయం సాధించాలనే పట్టుదలకు నైపుణ్యం తోడవడంతో స్కేటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఎండాడకు చెందిన అన్నా చెల్లెలు బొల్లాప్రగడ శ్రీ సాకేత్, శ్రీ సాహితి. రింక్‌లో అద్భుత ప్రదర్శన సాగిస్తూ.. జాతీయస్థాయిలో పతకాలు సొంతం చేసుకుంటున్నారు. అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమవుతున్నారు.  

ఎండాడ స్కైలైన్‌లో నివాసం ఉంటున్న బొల్లా ప్రగడ ప్రభాకర్, మాధురి దంపతుల సంతానమే ఈ చిచ్చర పిడుగులు. ఆరేళ్ల ప్రాయంలోనే శ్రీ సాకేత్‌ స్కేటింగ్‌లో ప్రతిభ కనపరిచాడు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతూ.. మరో వైపు స్కేటింగ్‌లో రాణిస్తూ అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాడు.

అన్న స్ఫూర్తితోనే చెల్లి కూడా స్కేటింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. నాలుగేళ్ల ప్రాయంలోనే ఆర్టిస్టిక్‌ స్కేటింగ్‌లో ప్రవేశం పొందిన శ్రీ సాహితి.. శివాజీ పార్కులోని స్కేటింగ్‌ రింక్‌లో కోచ్‌లు సత్యం, చిట్టిబాబు వద్ద శిక్షణ తీసుకుంది. ఏడాదిలోనే నైపుణ్యం సాధించి జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు పతకాలు సాధించింది.

శ్రీ సాకేత్‌ సాధించిన పతకాలివీ.. 
శ్రీ సాకేత్‌ జాతీయస్థాయిలో 7, రాష్ట్రస్థాయిలో 14 పతకాలతో పాటు జిల్లాస్థాయిలో 14 పతకాలు సాధించాడు. ఇందులో 17 బంగారు, 16 వెండి, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇన్‌లైన్‌ స్కేటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 9వ తరగతి చదువుతున్న శ్రీ సాకేత్, 7వ తరగతి చదువుతున్న శ్రీ సాహితి చదువులోనూ రాణిస్తున్నారు. జాతీయస్థాయి పోటీల్లో అత్యధిక పతకాలు సాధించడంతో పలువురు అభినందిస్తున్నారు.  

శ్రీ సాహితి ప్రతిభ ఇదీ..  
శ్రీ సాహితి జాతీయస్థాయిలో 18, రాష్ట్రస్థాయిలో 24, జిల్లాస్థాయిలో 33 పతకాలు కైవసం చేసుకుంది. ఇందులో 41 బంగారం, 31 వెండి, 3 కాంస్యం పతకాలు ఉన్నాయి. శాప్‌ నిర్వహించిన పోటీల్లో 6 పతకాలను సొంతం చేసుకోవడంతో పాటు విశాఖ, చంఢీగర్, పంజాబ్‌లోని మొహలీలో జరిగిన 57, 58, 59వ జాతీయ స్థాయి పోటీల్లో 9 బంగారు, 9 వెండి పతకాలు సాధించింది.  

అంతర్జాతీయ పోటీలకు  ముమ్మర సాధన 
ఇటీవల జరిగిన జాతీయ రోలర్‌ ఆర్టిస్టిక్‌ స్కేటింగ్‌ శిక్షణ శిబిరంలో అంతర్జాతీయ కోచ్‌ మార్క్‌ టోనీ వద్ద క్రీడా మెళకువలు నేర్చుకున్నారు. అతి త్వరలో జరగబోయే అంతర్జాతీయ క్రీడాపోటీల్లో దేశం తరఫున పతకం సాధించాలనే లక్ష్యంతో ముమ్మరంగా సాధన చేస్తున్నారు.  

తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే..  
ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు శిక్షణ పొందుతున్నాం. పోటీల్లో పాల్గొంటూ విజయాలు సాధిస్తున్నామంటే.. దీని వెనుక మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. చదువుకుంటూ అంతర్జాతీయ క్రీడా పోటీలకు సిద్ధమవుతున్నాం. కచ్చితంగా పతకాలు సాధించి విశాఖ జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తాం.                            – శ్రీ సాకేత్, శ్రీ సాహితి 

మరిన్ని వార్తలు