హీరో ఎవరో తెలియదు.. నా కథ అనిపిస్తే చాలు

21 Dec, 2020 12:20 IST|Sakshi

మేం ఏలియన్స్‌ కాదు.. సాధారణ వ్యక్తులమే...

బయోపిక్‌పై భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌

ఆనంద్‌ రాయ్‌ దర్శకత్వంలో సినిమాగా విషీ జీవితం

న్యూఢిల్లీ: భారత చెస్‌ దిక్సూచి విశ్వనాథన్‌ ఆనంద్‌. చదరంగంలో ఎవరూ ఊహించలేని ఎత్తులు పైఎత్తులతో అద్భుత విజయాలు సాధించిన ఆనంద్‌ భారత చెస్‌ ప్రపంచానికి ‘కింగ్‌’. అంకిత భావం, క్రమశిక్షణతో మెలిగే విషీ అందరికీ ప్రపంచ చాంపియన్‌గా, మేటి చెస్‌ క్రీడాకారుడిగానే తెలుసు. ఆట తప్ప మరో లోకం లేని ఆనంద్‌ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నడూ మాట్లాడింది లేదు. అయితే ఎప్పుడూ సౌమ్యంగా ఉండే ఆనంద్‌ గురించి తెలుసుకోవాలనేది అభిమానులందరి ఆశ. అందుకే మనకెవరికీ తెలియని ఈ దిగ్గజ క్రీడాకారుడి వ్యక్తిగత జీవితం, సరదాలు, సంతోషాలు, ప్రొఫెషనల్‌ కెరీర్‌ గురించి త్వరలోనే సినిమా రాబోతుంది.
ఈ బయోపిక్‌ ‘తనూ వెడ్స్‌ మనూ’ సినిమా తీసిన డైరెక్టర్‌ అనంద్‌ రాయ్‌ దర్శకత్వంలో రానుంది. ఈ సందర్భంగా తన బయోపిక్‌ ఎలా ఉంటుందో, ఎలా ఉండాలనుకుంటున్నాడో స్వయంగా ఆనంద్‌ మాటల్లోనే...

25 శాతం మాత్రమే తెలుసు...
నాణ్యమైన చిత్రబృందం ఈ బయోపిక్‌ను తెరకెక్కించనుంది. కెమెరాతో వారు సృష్టించే అద్భుతాలను కనీసం నేను ఊహించలేను. అందుకే సినిమా గురించి పూర్తిగా వారికే వదిలేశా. సినిమా ఎలా ఉండబోతోంది అనే అంశంపై నాకున్న అవగాహన కేవలం 25 శాతం మాత్రమే. తెరపై చూసినప్పుడు ఇది నా కథ అనే భావన నాకు కలిగితే చాలు. కాస్త వినోదాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ సినిమాను అభిమానులు ఎలా ఆదరిస్తారో అని తలుచుకుంటే ఆనందంగా ఉంటుంది. నా బయోపిక్‌ చెస్‌ను సరళమైన ఆటగా చూపించాలి కానీ ఆటలోని తీవ్రతను తీసేయకూడదు అని అనుకుంటున్నా.


మేం ఏలియన్స్‌ కాదు.. సాధారణ వ్యక్తులమే...
సినిమాలో నా వ్యక్తిగత జీవితాన్ని చూసినప్పుడు ప్రేక్షకులకు నేను కొత్తగా కనిపించవచ్చు. ఎందుకంటే సాధారణంగా నేనెప్పుడూ దాని గురించి బయటికి మాట్లాడలేదు. సినీ, క్రీడా తారలు, రాజకీయ ప్రముఖుల గురించి మనకు అంతా తెలుసు అని ప్రజలు అనుకుంటారు. నిజానికి వారి గురించి బయటివారికి ఏమీ తెలిసుండదు. చెస్‌ నాకెంత ముఖ్యమో తెలిసినవారంతా... నేను నిరంతరం ఆట గురించే ఆలోచిస్తా అని అనుకుంటారు. క్రీడాకారుడిగా నన్ను గమనించే వారికి వ్యక్తిగా నేనేంటో తెలియదు. ఈ చిత్రం చూశాక చెస్‌ ప్లేయర్లు ఏలియన్స్‌ (గ్రహాంతర వాసులు) కాదు సాధారణ వ్యక్తులే అనే భావనకు వస్తారు.

గ్రాండ్‌మాస్టర్‌ జీవితాన్ని ఆవిష్కరించాలి...
భారీ ప్రేక్షక గణాన్ని దృష్టిలో పెట్టుకొని సినీ నిర్మాతలు సినిమాలు చేస్తారు. దర్శకుడి ప్రతిభపై నమ్మకంతో ప్రేక్షకులు సినిమా చూస్తారు. కానీ నేను సినిమా ఎలా ఉండాలనుకుంటున్నానంటే.. సినిమా చూశాక ‘హా ఇదే కదా నేనూ అనుభవించింది’ అని నా మనసుకు అనిపించాలి. ప్రేక్షకుడికి చెస్‌ ప్రామాణికత, ఆటలోని తీవ్రత కచ్చితత్వంతో తెలిసేలా ఉండాలి. ఏకాగ్రత అనేది ఒక పోరాటం. అందరూ అందులో ప్రావీణ్యం సంపాదించలేరు. చెస్‌ ఆటగాడు బోర్డు ముందు కూర్చున్నప్పుడు అతను నిశ్శబ్ధంగా చేసే పోరాటాన్ని ప్రేక్షకుడు గ్రహించేలా సినిమా ఉండాలి.  


హీరో ఎవరో మరి!
ఇప్పటికీ నా పాత్రను పోషించే నటుడెవరో తెలియదు. మిగతా తారాగణం, షూటింగ్‌ షెడ్యూల్‌ గురించి తెలియదు. రాయ్‌ దర్శకత్వం వహించిన సినిమాలు కూడా పూర్తిగా చూసింది లేదు. నిజానికి అతని సినిమాలు చూసి, ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఉంది. సాధారణంగా సినిమాలు పెద్దగా చూడను. వంటలకు సంబంధించిన కార్యక్రమాలకు నేను అభిమానిని. డేవిడ్‌ అటెన్‌బారో డాక్యుమెంటరీలు చూస్తా. ఈ మధ్య బాస్కెట్‌బాల్‌ దిగ్గజం మైకేల్‌ జోర్డాన్‌ డాక్యుమెంటరీ ‘ద లాస్ట్‌ డ్యాన్స్‌’, చెస్‌ వెబ్‌ సిరీస్‌ ‘ద క్వీన్స్‌ గాంబిట్‌’ వీక్షించా. (చదవండి: నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు