Kohli-Viv Richards: విండీస్‌ దిగ్గజానికి క్లిష్ట పరిస్థితి.. కోహ్లి త్యాగం!

3 May, 2022 18:33 IST|Sakshi

వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ కోసం టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లి త్యాగం చేశాడు.  అదేంటి కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్‌లో బిజీగా ఉంటే ఈ త్యాగం అనే పదం ఎక్కడినుంచి వచ్చిందని ఆశ్చర్యపోకండి. కోహ్లి త్యాగం చేసింది ఇప్పుడు కాదు.. 2019లో వెస్టిండీస్‌ టూర్‌ సందర్భంగా. టీమిండియా మాజీ క్రికెటర్‌ వివేక్‌ రజ్దన్‌ ఇటీవలే ఒక ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. కోహ్లి, రిచర్డ్స్‌ మధ్య జరిగిన ఒక ఆసక్తికర ఘటనను ఆయన పంచుకున్నాడు.

'' 2019లో టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లింది.  అంటిగ్వాలో మ్యాచ్‌ పూర్తి చేసుకున్న టీమిండియా తర్వాతి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఫ్లైట్‌లో మ్యాచ్‌ జరిగే ప్రదేశానికి వెళ్లింది. అయితే అనుకోకుండా అదే ఫ్లైట్‌కు వివ్‌ రిచర్డ్స్‌ కూడా రావాల్సి వచ్చింది. అప్పటికే టీమిండియా ఆటగాళ్ల లగేజితో క్యాబిన్స్‌ అన్నీ ఫుల్‌ అయ్యాయి. రిచర్డ్స్‌ తన లగేజీ పెట్టుకోవడానికి అన్ని క్యాబిన్స్‌ చూసినప్పటికి లాభం లేకపోయింది. అయితే ఇదంతా గమనించిన కోహ్లి తన సీటు నుంచి లేచి.. తోటి ఆటగాళ్ల లగేజీని సర్ది తన లగేజీని కిందకు దించాడు. ఆ తర్వాత రిచర్డ్స్‌ లగేజీని తీసుకొని తన క్యాబిన్‌లో పెట్టాడు. తన లగేజీని కోహ్లి తాను కూర్చున్న సీటు కిందే పెట్టుకున్నాడు. కోహ్లి చర్యకు ముచ్చటపడిన రిచర్డ్స్‌ చిరునవ్వుతో అతని భుజాన్ని నిమిరాడు.  ఆ తర్వాత సహాయం చేసినందుకు థ్యాంక్స్‌ చెప్పాడు. అంటూ వివరించాడు. 

కాగా కోహ్లి ఇదే విండీస్‌ టూర్‌లో ఆఖరిసారి సెంచరీ నమోదు చేశాడు. అప్పటినుంచి సెంచరీ చేయడంలో విఫలమవుతూ వచ్చిన కోహ్లి మూడేళ్లు కావొస్తున్నప్పటికి శతకం మాత్రం అందుకోలేదు. దీనికి తోడూ బ్యాటింగ్‌లోనూ చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌లోనూ చెత్త ఫామ్‌ను కొనసాగించిన కోహ్లి.. ఎట్టకేలకు గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. అయితే కోహ్లి అర్థసెంచరీ చేసినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ పడుతూ లేస్తూ తమ ప్రయాణం కొనసాగిస్తుంది. ఆరంభంలో మంచి విజయాలు సాధించినప్పటికి సీజన్‌ మధ్యలో పరాజయాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
చదవండి: Tilak Varma: తిలక్‌ నువ్వు ఇలా కూడా చేస్తావా? పాపం బేబీ ఏబీడీ! వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు