రెండో టెస్ట్‌ తుది జట్టులోకి అశ్విన్‌ను తీసుకోవాలని వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రతిపాదన

10 Aug, 2021 10:46 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్ట్‌కు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి కచ్చితంగా తీసుకోవాలని దిగ్గజ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రతిపాదించాడు. పరిస్థితులను పట్టించుకోకుండా అతనికి అవకాశమివ్వాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్‌ అద్భుత ప్రదర్శన చేసినా.. కౌంటీ క్రికెట్‌లో రాణించినా.. ఇంగ్లండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ పై విధంగా స్పందించాడు. 

ఇదిలా ఉంటే, పిచ్ పేసర్లకు సహకరిస్తుందని తొలి టెస్ట్‌లో కోహ్లీ సేన నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌ ఫార్ములాతో బరిలోకి దిగింది. దాంతో అశ్విన్‌ స్థానంలో నాలుగో పేసర్‌ కోటాలో శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ ఫార్ములా సెక్సెస్‌ కావడంతో సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే ఫార్ములాను కొనసాగిస్తామని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పడంతో లక్ష్మణ్‌ స్పందించాడు. అశ్విన్ జట్టులోకి వస్తే బౌలింగ్ డెప్త్ పెరుగుతుందని, తానైతే పరిస్థితులతో సంబంధం లేకుండా అశ్విన్‌ను జట్టులోకి తీసుకునేవాడినని క్రిక్‌ ఇన్ఫోతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. 

పరిస్థితులు, వాతావరణం ఎలా ఉన్నా అశ్విన్‌ మేటి బౌలర్‌ అని, అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచి ఇంగ్లండ్‌పై ఒత్తిడి తీసుకురాగల సమర్థుడని కొనియాడాడు. ఇక తొలి టెస్టులో బౌలింగ్‌లో రాణించిన శార్ధూల్‌పై కూడా లక్ష్మణ్‌ స్పందించాడు. శార్ధూల్‌ బ్యాట్‌తో రాణించకపోయినా బంతితో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని కితాబునిచ్చాడు. అశ్విన్, శార్దూల్ ఇద్దరూ సమర్థవంతులే అయినప్పటికీ.. తన ఓటు మాత్రం అశ్విన్‌కే ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా గెలుపుకు వరుణుడు ఆటంకంగా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి రోజు తొమ్మిది వికెట్లు చేతిలో ఉండి, కేవలం 157 పరుగులు చేయాల్సిన సందర్భంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు