VVS Laxman: అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియా కుర్రాళ్లపై ప్రశంసలు కురిపించిన ఎన్‌సీఏ డైరెక్టర్‌ 

6 Feb, 2022 15:25 IST|Sakshi

అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి, రికార్డు స్థాయిలో ఐదో టైటిల్‌ గెలిచిన యువ భారత జట్టుపై నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా కుర్రాళ్లు గెలిచిన ఈ టైటిల్‌ చాలా ప్రత్యేకమని కొనియాడాడు. టోర్నీ మధ్యలో కీలక ఆటగాళ్లు కరోనా బారిన పడినా, యువ భారత జట్టు  ఏమాత్రం వెరవకుండా, మొక్కవోని ధైర్యంతో అద్భుత విజయాలతో టోర్నీని ముగించిందని ఆకాశానికెత్తాడు. ఆసియా కప్ టైటిల్ గెలిచిన నెలరోజుల్లోపే ప్రపంచకప్ టైటిల్ కూడా చేజిక్కించుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని సంబురపడిపోయాడు. ఈ సందర్భంగా హెడ్‌ కోచ్‌ హృషికేశ్ కనిత్కర్, ఇతర సహాయక సిబ్బందిని అభినందించాడు.


కాగా, రాహుల్ ద్రవిడ్‌ అనంతరం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వీవీఎస్‌(వెరి వెరి స్పెషల్‌) లక్ష్మణ్‌.. పగ్గాలు చేపట్టిన తొలి నాటి నుంచే యువ ఆటగాళ్లపై తనదైన ముద్రను వేశాడు. అతని పర్యవేక్షనలో యంగ్‌ ఇండియా ఆటగాళ్లు రాటుదేలారు. యువ భారత జట్టు ఎక్కడికి వెళ్లినా లక్ష్మణ్‌ కూడా జట్టుతో పాటే ఉండి, ఆటగాళ్లను దగ్గరుండి మరీ ప్రోత్సహించాడు. ప్రస్తుత ప్రపంచకప్‌ వేదిక అయిన కరీబియన్‌ దీవులకు సైతం లక్ష్మణ్‌ వెళ్లి యువ జట్టులో ధైర్యం నింపాడు. ఫలితంగా అతని పర్యవేక్షణలో యువ భారత జట్టు నెల వ్యవధిలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే, దాదాపు 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన లక్ష్మణ్‌.. ఒక్క వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ కూడా ఆడకుండానే యువ జట్టు మార్గనిర్దేశకుడిగా అద్బుతాలు చేస్తున్నాడు.

చదవండి: మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా ఇంట్లో తీవ్ర విషాదం

మరిన్ని వార్తలు