ఈ హైదరాబాదీ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు..

20 May, 2021 22:19 IST|Sakshi

హైదరాబాద్: టీమిండియా యువ పేసర్, హైదరాబాద్ స్పీడ్‌స్టర్‌ మహ్మద్‌ సిరాజ్ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని భారత దిగ్గజ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ జోస్యం చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించడానికి కావాల్సిన రెండు లక్షణాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లండ్‌ పర్యటనలో జట్టులో సీనియర్ పేసర్లు ఉండడంతో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ఆడే అవకాశం అతనికి వస్తుందో లేదోనని అనుమానాన్ని వ్యక్తం చేశారు. 

గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో సిరాజ్‌ అద్భుతంగా రాణిస్తున్నాడని.. దీంతో  ప్రపంచవ్యాప్తంగా అతని పేరు కచ్చితంగా మార్మోగుతుందని జోస్యం చెప్పాడు. బంతిని స్వింగ్‌ చేయడం, సుదీర్ఘంగా బౌలింగ్‌ చేయడం ఫాస్ట్‌ బౌలర్‌కు ఉండాల్సిన రెండు లక్షణాలని, ఆ రెండూ సిరాజ్‌లో పుష్కలంగా ఉన్నాయని కితాబునిచ్చాడు. టెస్ట్‌ల్లో ఒకే రోజు మూడు స్పెల్‌లు వేయగల సత్తా సైతం సిరాజ్‌కు ఉందని, అన్ని వేళలా వేగం, కచ్చితత్వంతో బంతులను సంధించడంలో అతను నేర్పరి అని కొనియాడాడు. 

ప్రస్తతం టీమిండియాలో అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారని, వారి సహచర్యంలో సిరాజ్‌ మరింత రాటుదేలుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే అతను ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి గాయాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించాడు. కాగా, ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు జూన్ 2న ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. 
చదవండి: ధోని సలహాల వల్ల చాలా మెరుగయ్యాను..

>
మరిన్ని వార్తలు