‌టీ20 వరల్డ్‌కప్‌‌ ఆడే అర్హత వారిద్దరికి ఉంది: లక్ష్మణ్‌

25 Mar, 2021 18:00 IST|Sakshi

వీవీఎస్‌ లక్ష్మణ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: మహ్మద్‌ సిరాజ్‌.. నటరాజన్‌.. నవదీప్‌ సైనీ.. వాషింగ్టన్‌ సుందర్‌.. శుభ్‌మన్‌ గిల్‌.. ఆస్టేలియా పర్యటన ద్వారా టీమిండియాకు దొరికిన మంచి ఆటగాళ్లు. అరంగేట్రంలోనే అదరగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌ ద్వారా పలువురు భారత క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ రెండో మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేశారు. ఇక వన్డేల విషయానికొస్తే కృనాల్‌ పాండ్యా(అంతకు ముందే టీ20 ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు), ప్రసిద్ద్‌ కృష్ణ కూడా తొలి వన్డేతో  అరంగేట్రం చేసి పలు రికార్డులు నమోదు చేశారు.

విదేశమైనా, స్వదేశమైనా ఆడిన తొలి మ్యాచ్‌లలోనే తమ ప్రభావం చూపిన ఈ ఆటగాళ్లపై మాజీలు నేటికీ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది చివరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ జట్టు కూర్పు గురించి టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో అందివచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఇషాన్‌ కిషన్‌ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ ఆట తీరు కూడా అద్భుతం.

టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించి నా పదిహేను మంది స్వ్యాడ్‌లో వీరిద్దరికి కచ్చితంగా స్థానం ఉంటుంది. వరల్డ్‌ కప్‌ తుదిజట్టులో ఆడేందుకు వారిద్దరికి పూర్తి అర్హత ఉందని భావిస్తున్నాను’’ అని లక్ష్మణ్‌ చెప్పుకొచ్చాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన సూర్యకుమార్‌ మైండ్‌సెట్‌ తనను ఆశ్చర్యపరిచిందని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. కాగా రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేసిన ఇషాన్‌ కిషన్‌,  ఆ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకుని ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక నాలుగో టీ20లో 28 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేసి సూర్యకుమార్‌ అందరిచేతా ప్రశంసలు అందుకున్నాడు.

చదవండి: టీ20 వరల్డ్ కప్‌ విజేత ఆ జట్టే: మైకేల్‌ వాన్
 ఆసీస్‌ టూర్‌: సిరాజ్‌ నుంచి సుందర్‌ దాకా!

మరిన్ని వార్తలు