Warm Up Match: వాషింగ్టన్ సుందర్‌ను స్లెడ్జింగ్‌ చేసిన సిరాజ్

21 Jul, 2021 19:55 IST|Sakshi
photo courtesy: twitter

డర్హమ్‌: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు కౌంటీ ఎలెవన్‌ జట్టుతో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభం అయిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. కేఎల్‌ రాహుల్‌(150 బంతుల్లో 101 రిటైర్డ్ ఔట్; 11 ఫోర్లు, సిక్స్‌), రవీంద్ర జడేజా (146 బంతుల్లో 75; 5 ఫోర్లు, సిక్స్‌) సెంచరీ, హాఫ్ సెంచరీలతో  రాణించడంతో 311 పరుగల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బుధవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కౌంటీ ఎలెవన్‌ ఆది నుంచి తడబడుతూ ఉంది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు(వాషింగ్టన్ సుందర్‌, ఆవేశ్‌ ఖాన్‌) ప్రత్యర్ధి జట్టు తరఫున బరిలోకి దిగారు.

ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్‌(1)ను టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు. అయితే అంతకు ముందు సిరాజ్‌.. సుందర్‌తో గొడవకు దిగాడు. వారి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే సహచరులు సర్ధి చెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. ఆ వెంటనే సిరాజ్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్యాచ్‌ అందుకోవడంతో సుందర్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు ఓపెనర్ లిబ్బి (12)ని ఉమేశ్‌ యాదవ్‌, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ రాబర్ట్ యేట్స్ (1)ను బుమ్రా పెవిలియన్‌కు పంపారు.

అనంతరం​ కెప్టెన్‌ విల్‌ రోడ్స్‌(11) ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఉమేశ్‌ యాదవ్‌ అతన్ని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో కౌంటీ ఎలెవన్‌ జట్టు రెండో రోజు భోజన విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో హసీబ్ హమీద్ (47), లిండన్‌ జేమ్స్‌(5) ఉన్నారు. టీమిండియా బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీయగా, బుమ్రా, సిరాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కాగా, ఈ సన్నాహక మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే‌తో పాటు సీనియర్ బౌలర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ దూరంగా ఉన్నారు. దాంతో రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. ఆగష్టు 4 నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.

>
మరిన్ని వార్తలు