చెలరేగిన వార్నర్‌.. అదిరే ఆరంభం

27 Oct, 2020 20:16 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఎట్టకేలకు అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కచ్చితంగా గెలిస్తేనే ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండే క్రమంలో వార్నర్‌ జూలు విదిల్చాడు. 25 బంతుల్లో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. రబడా వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో వార్నర్‌ చెలరేగిపోయాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌తో 22 పరుగులు సాధించి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ పవర్‌ ప్లేలో అత్యధిక స్కోరు 79. 2017లో దీన్ని సాధించారు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ అత్యధిక పవర్‌ ప్లే స్కోరు చేసింది. ఆ తర్వాత  గతేడాది కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పవర్‌ ప్లేలో 77 పరుగులు చేసింది. ఇప్పుడు అదే స్కోరు ఢిల్లీపై నమోదు చేసింది ఆరెంజ్‌ ఆర్మీ.

టాస్‌ గెలిచిన ఢిల్లీ..  ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.  దాంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను వార్నర్‌-సాహాలు ఆరంభించారు. బెయిర్‌ స్టోను పక్కకు పెట్టిన సన్‌రైజర్స్‌.. విలియమ్సన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. దాంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను సాహాతో కలిసి వార్నర్‌ ప్రారంభించాడు.  ఈ జోడీ రబడా వేసిన రెండో ఓవర్‌లో 15 పరుగులు సాధించి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. ఆ తర్వాత అదే ఊపును కొనసాగించిన సన్‌రైజర్స్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.  కాగా, 34 బంతుల్లో 8 ఫోర్లు, 2సిక్స్‌లతో  66 పరుగులు సాధించిన వార్నర్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. అశ్విన్‌ వేసిన 10 ఓవర్‌ నాల్గో బంతికి వార్నర్‌ పెవిలియన్‌ చేరాడు.10 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ వికెట్‌ నష్టానికి 113 పరుగులు చేసింది. ఇక సాహా కూడా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 బంతుల్లో 8 ఫోర్లతో అర్థ శతకం నమోదు చేశాడు. వార్నర్‌-సాహాల జోడి తొలి వికెట్‌కు 107 పరుగులు చేసింది.

>
మరిన్ని వార్తలు