ఆ టోర్నీకి వార్నర్‌ దూరం..!

2 Oct, 2020 20:22 IST|Sakshi

సిడ్నీ: ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. స్వదేశంలో జరుగనున్న బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో ఆడటానికి మొగ్గుచూపడం లేదు. వచ్చే ఫిబ్రవరి వరకూ ఆసీస్‌ దేశవాళీ సీజన్‌ బిజీగా ఉన్నందున బిగ్‌బాష్‌ లీగ్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడట. ఈ డిసెంబర్‌లో ఆరంభం కానున్న బీబీఎల్‌కు వార్నర్‌ అందుబాటులో ఉండకపోవచ్చని అతని మేనేజర్‌ జేమ్స్‌ ఎరిస్కిన్‌ స్పష్టం చేశాడు. సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌తో ఎరిస్కిన్‌ మాట్లాడుతూ..‘ నాతో బీబీఎల్‌ గురించి వార్నర్‌ ఏమీ మాట్లాడలేదు. బీబీఎల్‌ ఆడటానికి వార్నర్‌ సుముఖంగా లేడు.(చదవండి: ఇదెక్కడి డీఆర్‌ఎస్‌ రూల్‌?)

ఇక్కడ డబ్బు గురించి వార్నర్‌ ఆలోచించడం లేదు. ఫ్యామిలీతో గడపాలని చూస్తున్నాడు. బీబీఎల్‌ కంటే కుటుంబంతో ఉంటే ఉత్తమం అని వార్నర్‌ భావిస్తున్నాడు. రాబోవు ఆస్ట్రేలియా సీజన్‌ బిజీగా ఉంది. ఒకవేళ బీబీఎల్‌ ఆడితే విరామం లేకుండా పోతుంది. కాకపోతే చివరి వార్నర్‌ ఏమి చేయాలనుకుంటున్నాడో అతని నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది’ అని తెలిపాడు.

సెప్టెంబర్‌ 19వ తేదీన ఆరంభమైన ఐపీఎల్‌.. వచ్చే నెల 10వ తేదీ వరకూ కొనసాగుతోంది. ఒకవేళ బీబీఎల్‌కు ఓకే చెబితే విశ్రాంతి తీసుకోవడానికి పెద్దగా సమయం ఉండదు. దాంతోనే బీబీఎల్‌కు బ్రేక్‌ ఇవ్వాలని వార్నర్‌ యోచనగా ఉన్నట్లు ఎరిస్కిన్‌ మాటల్లో తెలుస్తోంది. బీబీఎల్‌ను కూడా బయో బబుల్‌ వాతావరణంలో జరపాలని నిర్ణయించడంతో కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడమే వార్నర్‌ విముఖతకు ప్రధానం కారణం.  డిసెంబర్‌లోనే ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ వెళ్లనుంది. కాగా, బీబీఎల్‌కు చివరి రెండు నుంచి మూడు వారాలకు టాప్‌ క్రికెటర్లంతా అందుబాటులో ఉండనుండగా, వార్నర్‌ మాత్రం అందుకు సిద్ధం లేనట్లు సమాచారం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు