'మా బౌలర్ల ప్రదర్శన నిజంగా అద్భుతం'

30 Sep, 2020 15:52 IST|Sakshi

అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌లో తొలిసారి విజయం సాధించి భోణీ చేసింది. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మ్యాచ్‌ అనంతరం విజయంపై స్పందించాడు.

'ఈరోజు మా బౌలర్ల​ప్రదర్శన అద్భుతంగా సాగింది.. మా బౌలర్లు ప్రతీ ఒక్కరు చాలా కష్టపడ్డారు. రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తమ అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టగా.. నటరాజన్‌ తన యార్కర్లతో బెంబేలెత్తించాడు. ముఖ్యంగా రషీద్‌ 4 ఓవర్లో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు, భూవీ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దురదృష్టవశాత్తు మొదటి మ్యాచ్‌లో మార్ష్‌ గాయపడిన తర్వాత మా జట్టులో ఐదో బౌలర్‌ లోటు కనిపించింది. కానీ ఢిల్లీతో మ్యాచ్‌లో స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ మంచి బౌలింగ్‌ ప్రదర్శించి ఐదో బౌలర్‌గా ఆకట్టుకున్నాడు. అయితే బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.

బెయిర్‌ స్టోతో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించినా భారీ షాట్లు ఆడలేకపోయాం. పిచ్‌ కఠినంగా ఉండడంతో బౌండరీలు కంటే పరుగులే ఎక్కువగా ఉండడం.. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తాల్సి వచ్చింది. కేన్‌ విలియమ్సన్‌ ఎంత విలువైన ఆటగాడో ఈ మ్యాచ్‌ ద్వారా తెలిసింది. ఈ సమయంలో అతను జట్టుతో తిరిగి చేరడం మా బ్యాటింగ్‌ బలాన్ని పెంచింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. మాకన్నా పిచ్‌ పరిస్థితులు ఢిల్లీ జట్టుకే ఎక్కువగా తెలుస్తుంది. కానీ వారు ఈ మ్యాచ్‌లో చేదనలో విఫలమయ్యారు.' అని తెలిపారు. కాగా సన్‌రైజర్స్ తన తర్వాతి మ్యాచ్‌ అక్టోబర్‌ 2న సీఎస్‌కేతో తలపడనుంది.(చదవండి : ‘నటరాజన్‌.. నిప్పులు చెరిగే బంతులవి’)

మరిన్ని వార్తలు