శ‌వాల‌తో రోడ్లపై క్యూ క‌ట్టడం చూశాక నిద్రపట్టేది కాదు..

2 Jun, 2021 16:18 IST|Sakshi

మెల్‌బోర్న్‌: భారత్‌లో క‌రోనా మహమ్మారి రెండో దశలో ఉగ్రరూపం దాల్చిందని, ఆ విలయాన్ని ప్రత్యక్షంగా చూసి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితులో ఉన్నానని ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెట‌ర్ డేవిడ్ వార్నర్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న భయానక పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్‌.. ఇటీవలే అన్ని అడ్డంకులు(క్వారంటైన్‌ నిబంధనలు) అధిగ‌మించి ఇంటికి చేరాడు. ఈ సంద‌ర్భంగా భారత్‌లో తనకు ఎదురైన అనుభవాలను మీడియాతో షేర్‌ చేసుకున్నాడు.

భారత్‌లో కరోనా రెండో దశ చరమాంకంలోకి వచ్చినప్పటికీ అక్కడి పరిస్థితుల్లో ఏ మార్పు లేదని, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నెలకొన్న దారుణ పరిస్థితులే ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. కరోనా రెండో దశ పతాక స్థాయిలో(ఏప్రిల్‌) ఉన్నప్పటి ప‌రిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ.. ఆక్సిజ‌న్ కోసం భారత్‌లోని ప్రజ‌లు అల్లాడిపోవ‌డం కళ్లార చూశానని, గ్రౌండ్ నుంచి హోట‌ల్‌కు వెళ్లి వ‌చ్చే స‌మ‌యాల్లో క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కుటుంబ స‌భ్యులు వీధుల్లో లైన్లు క‌ట్టడం చూశానని చెప్పుకొచ్చాడు.

ఆ సన్నివేశాలు చూశాక రాత్రిళ్లు నిద్రపట్టేది కాదని తెలిపాడు. అలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్‌ను ర‌ద్దు చేసి బీసీసీఐ స‌రైన నిర్ణయ‌ం తీసుకుందని వివరించాడు. బయో బ‌బుల్‌లో కూడా కేసులు న‌మోదు అయిన త‌ర్వాత ఆటగాళ్లంతా అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బ‌య‌ట‌ప‌డాల‌ని ఎదురు చూశారని తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన భారతీయులకు క్రికెట్‌పై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాడు. కాగా, నలుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో మే 4న ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్ధంతరంగా రద్దైంది. లీగ్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబర్‌, అక్టోబర్‌ మధ్యలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది.
చదవండి: మహిళా క్రికెట్‌కు మీడియా మద్దతు అవసరం..
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు