AUS VS WI 2nd T20: చెలరేగిన వార్నర్‌.. నిప్పులు చెరిగిన స్టార్క్‌

7 Oct, 2022 18:16 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌కు ముందు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఆ జట్టు ఆటగాళ్లు స్థాయి మేరకు సత్తా చాటారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆసీస్‌ 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇవాళ (అక్టోబర్‌ 7) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆసీస్‌ 31 పరుగుల తేడాతో పర్యాటక జట్టును మట్టికరిపించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (41 బంతుల్లో 75; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ (20 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. 

విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసెఫ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఓబెద్‌ మెక్‌కాయ్‌ 2, ఓడియన్‌ స్మిత్‌ ఓ వికెట్‌ సాధించారు. అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌.. మిచెల్‌ స్టార్క్‌ (4/20) నిప్పులు చెరగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. విండీస్‌ బ్యాటర్లలో జాన్సన్‌ చార్లెస్‌ (29), బ్రాండన్‌ కింగ్‌ (23), అకీల్‌ హొసేన్‌ (25) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతావారంతా చేతులెత్తేశారు. 

ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌కు జతగా పాట్‌ కమిన్స్‌ (2/32), కెమరూన్‌ గ్రీన్‌ (1/35), ఆడమ్‌ జంపా (1/34) రాణించారు. బ్యాటింగ్‌లో చెలరేగిన వార్నర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు కూడా దక్కింది. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లోనూ ఆసీస్‌ పేస్‌ త్రయం స్టార్క్‌, కమిన్స్‌, హేజిల్‌వుడ్‌ చెలరేగి బౌలింగ్‌ చేయగా.. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (58) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో, వికెట్‌కీపర్‌ మాథ్యూ వేడ్‌ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. 
 

మరిన్ని వార్తలు