జోష్‌లో ఉన్న ఆసీస్‌కు షాక్‌

30 Nov, 2020 10:26 IST|Sakshi

సిడ్నీ: టీమిండియాతో వన్డే సిరీస్‌ను ఇంకా మ్యాచ్‌ ఉండగానే గెలుచుకుని మంచి జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మిగిలిన వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. గజ్జల్లో గాయం కారణంగా భారత్‌తో పరిమిత ఓవర్ల నుంచి వార్నర్‌ ఔటైన విషయాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. వార్నర్‌ గాయం నుంచి కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఆటగాళ్ల పునరావస కేంద్రంలో చికిత్సతీసుకుంటున్న వార్నర్‌.. టెస్టు సిరీస్‌లో ఆడటం కూడా అనుమానంగానే ఉంది. టీమిండియాతో టీ20 సిరీస్‌కు వార్నర్‌ స్థానంలో డీ ఆర్సీ షార్ట్‌కు అవకాశం
కల్పిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. టీమిండియాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆసీస్‌ 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. (చదవండి: కెప్టెన్‌గా కోహ్లి చేసిన ఆ తప్పిదాలతోనే..!)

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 389 పరుగులు చేయగా, టీమిండియా 338 పరుగులు చేసి పరాజయం చెందింది. దాంతో సిరీస్‌ను ఆసీస్‌ 2-0తేడాతో గెలుచుకుంది. నిన్నటి మ్యాచ్‌లో వార్నర్‌ 83 పరుగులు చేశాడు. కాగా, ఫీల్డింగ్‌ చేసే సమయంలో గజ్జల్లో గాయంతో సతమతమైన వార్నర్‌  ఫీల్డ్‌ను వీడాడు. ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌కు కమిన్స్‌కు విశ్రాంతి కల్పించారు. చివరి వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు సైతం కమిన్స్‌కు విశ్రాంతినిచ్చారు. టెస్టు సిరీస్‌కు పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలని భావిస్తున్న ఆసీస్‌.. దానిలో భాగంగా కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చింది.       
 

మరిన్ని వార్తలు