Washington Sundar: గాయాలతోనే ఏడాది గడిచిపోయింది.. జట్టులోకి వచ్చేదెన్నడు?

16 Aug, 2022 19:48 IST|Sakshi

వాషింగ్టన్‌ సుందర్‌.. టీమిండియా క్రికెటర్లలో అత్యంత దురదృష్టవంతుడిగా పేరు పొందాడు. ఈ పదం అతనికి అచ్చు గుద్దినట్లుగా సరిపోతుంది. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా పేరున్న సుందర్‌ జట్టులో ఉన్నాడనడం కంటే బయటే ఎక్కువున్నాడని చెప్పొచ్చు. దాదాపు ఒక ఏడాది మొత్తం గాయాలతోనే గడపాల్సి వచ్చింది సుందర్.(2021 ఆగస్టు నుంచి మొదలుకొని 2022 ఆగస్టు వరకు).

జట్టులోకి ఎంపికయ్యాడన్న ప్రతీసారి ఏదో ఒక గాయం కారణంగా మళ్లీ దూరమవడం.. ఇదే సుందర్‌కు తంతుగా మారిపోయింది. గాయాలను వెతుక్కుంటూ తను వెళ్తున్నాడో లేక అవే అతని దగ్గరికి వస్తున్నాయో అర్థం కావడం లేదు.
- సాక్షి, వెబ్‌డెస్క్‌

తాజాగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన రాయల్‌ లండన్‌ కప్‌లో ఒక మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో భుజానికి గాయమైంది. ఎక్స్‌రే తీయగా.. గాయం తీవ్రత ఎక్కువని తేలింది. దీంతో జింబాబ్వే పర్యటనకు దూరం కావాల్సి వచ్చింది. కాగా బీసీసీఐ సుందర్‌ స్థానంలో షాబాజ్‌ అహ్మద్‌ను ఎంపిక చేసింది.  కేఎల్‌ రాహుల్‌ నేతృత్వంలోని టీమిండియా యువజట్టు ప్రస్తుతం జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్‌ ఆడనుంది. ఇలా 2022 ఏడాది ఆరంభం నుంచి సుందర్‌కు ఏది కలిసి రావడం రాలేదు. ఒక 2021 ఆగస్టు నుంచి సుందర్‌ ఏయే గాయాల బారీన పడ్డాడో తెలుసుకుందాం.

జూలై 2021.. చేతి వేలికి గాయం
ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా కౌంటీ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహించిన సుందర్‌ ఇండియాతో మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో చేతి వేలికి గాయమైంది. దీంతో ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌తో పాటు ఐపీఎల్‌ 2021(రెండో అంచె పోటీలు), ఆ తర్వాత టి20 వరల్డ్‌కప్‌ 2021కు దూరమయ్యాడు.

జనవరి 2022.. కోవిడ్‌-19 పాజిటివ్‌గా
చేతివేలి గాయం అనంతరం దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌హజారే ట్రోపీలో అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఈ ప్రదర్శను సుందర్‌ను సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యేలా చేసింది. కానీ కోవిడ్‌-19 రూపంలో సుందర్‌ను దురదృష్టం వెంటాడింది. ప్రొటిస్‌ పర్యటనకు బయలుదేరడానికి ముందు జనవరి 11న సుందర్‌ కరోనా పాజిటివ్‌గా తేలడంతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది.

ఫిబ్రవరి 2022.. తొడ కండరాల గాయంతో..
స్వదేశంలో విండీస్‌తో సిరీస్‌కు ఎంపికయిన సుందర్‌ ఒకే ఒక్క మ్యాచ్‌కు పరిమితమయ్యాడు. విండీస్‌తో మూడో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్‌ మధ్యలోనే వెళ్లిపోయాడు. అలా కండరాల గాయంతో విండీస్‌తో టి20 సిరీస్‌కు.. అటుపై శ్రీలంకతో టి20 సిరీస్‌కు సుందర్‌ దూరమయ్యాడు.

ఏప్రిల్‌ 2022.. చేతికి గాయం..
విండీస్‌, లంకతో సిరీస్‌లకు దూరమైన సుందర్‌ ఆ తర్వాత ఐపీఎల్‌ 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఏప్రిల్‌ 11న గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో బంతిని అందుకునే క్రమంలో చేయికి గాయమైంది. దీంతో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్‌ ఆడినప్పటికి.. టీమిండియాలోకి రాలేకపోయాడు.

ఆగస్టు 2022.. భుజం గాయంతో..
ఐపీఎల్‌ ముగిసిన తర్వాత టీమిండియాలో చాన్స్‌ రాకపోవడంతో కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు లండన్‌ వెళ్లాడు. అక్కడ లంకాషైర్‌ తరపున అద్భుత ప్రదర్శన కనబరిచి జింబాబ్వే టూర్‌కు ఎంపికయ్యాడు. ఈసారి కచ్చితంగా జట్టు తరపున బరిలోకి దిగుతాడని అనుకునేలోపే.. రాయల్‌ లండన్‌ కప్‌లో ఆడుతూ భుజం గాయంతో జింబాబ్వే సిరీస్‌కు ఆఖరి నిమిషంలో దూరమయ్యాడు.

ఇలా ఏడాది మొత్తం గాయాలతోనే సహవాసం చేసిన సుందర్‌ ఇక జట్టులోకి వచ్చేదెన్నడు అని అభిమానులు కామెంట్స్‌ చేశారు. మరి రాబోయే రోజుల్లోనైనా సుందర్‌ ఎటువంటి గాయాల బారీన పడకుండా టీమిండియా జట్టులోకి రావాలని ఆశిద్దాం.

చదవండి: సుందర్‌ను మరిచారా.. కావాలనే పక్కనబెట్టారా!

 సుందర్‌ 'నమ్మశక్యం కాని బౌలింగ్‌'.. నోరెళ్లబెట్టిన ప్రత్యర్థి బ్యాటర్

సుందర్‌ స్థానాన్ని భర్తీ చేయనున్న ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ 

మరిన్ని వార్తలు