Washington Sundar: వారు సహకరిస్తే బాగుండు.. సుందర్‌ తండ్రి ఎమోషనల్‌

7 Mar, 2021 10:55 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అక్షర్‌ పటేల్‌ 43 పరుగులతో మంచి సహకారం అందించడంతో సుందర్‌ కచ్చితంగా సెంచరీ చేస్తాడని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అక్షర్‌ పటేల్‌ వెనుదిరగడం.. ఆ తర్వాత వచ్చిన ఇషాంత్‌, సిరాజ్‌లు కూడా డకౌట్లుగా వెనుదిరగడంతో సుందర్‌ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. కానీ సుందర్‌ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ మాత్రం చిరకాలం గుర్తుండిపోతుందనంలో సందేహం లేదు.  సుందర్‌ సెంచరీ మార్క్‌ను అందుకోకపోవడంతో తాను నిరాశకు గురయ్యాయని తండ్రి ఎమ్‌. సుందర్‌ పేర్కొన్నాడు.

'నా కొడుకు బ్యాటింగ్‌ చూసి కొంతమంది ఆశ్చర్యపోతుండడం నాకు వింతగా అనిపించింది. వాస్తవానికి వాడిలో మంచి బ్యాట్స్‌మన్‌ దాగున్నాడు. కఠిన పరిస్థితుల్లో ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియా ఎప్పుడు కష్టాల్లో ఉన్న సుందర్‌ ఇలానే జట్టును ఆదుకున్నాడు. ఆసీస్‌ పర్యటనలోనూ ఇది రుజువైంది. కానీ ఒక్క విషయం మాత్రం నన్ను తీవ్రంగా బాధిస్తుంది. 96 పరుగులకు చేరుకున్న తర్వాత నా కొడుకు సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని భావించా. కానీ అక్షర్‌ పటేల్‌ అవుటైన తర్వాత వచ్చిన ఇషాంత్‌, సిరాజ్‌లు డకౌట్‌ అయ్యారు. వారిని తప్పుబట్టలేను కానీ వారు కాస్త సహకరించి ఉంటే బాగుండేది. అయితే టీమిండియా విజయం సాధించడం నా బాధను మరిచిపోయేలా చేసింది.' అంటూ తెలిపాడు.

నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా వరుసగా హ్యాట్రిక్‌ గెలుపును అందుకుంది. ఫలితంగా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్యూటీసీ) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరగా, తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 135 పరుగులకు ఆలౌట్‌ అయింది.  దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్‌ విజయం లభించింది. అక్షర్‌ పటేల్, అశ్విన్‌ చెరో‌ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ నడ్డి విరిచి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది.  జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది.
చదవండి:
టీమిండియా విజయం.. సగర్వంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు
కమాన్‌ కోహ్లి.. ఎంత పని చేశావ్‌ : రూట్‌

మరిన్ని వార్తలు