'ఆ టెస్టు నాకు ప్రత్యేకం.. అందుకే కుక్కకు ఆ పేరు'

4 Apr, 2021 09:13 IST|Sakshi

చెన్నై: కెరీర్‌ తొలి టెస్టు అంటే ఏ క్రికెటర్‌కైనా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అదే ఆ మ్యాచ్‌లో చిరస్మరణీయ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తే ఇక ఆ మైదానం, వేదిక సహజంగానే చిరస్మరణీయంగా మారిపోతుంది. ఏదో రూపంలో దానిని రోజూ గుర్తు చేసుకునేవారు చాలా మంది. ఇప్పుడు భారత ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా అదే పని చేశాడు. తన తొలి టెస్టు ఆడిన బ్రిస్బేన్‌లోని ‘గాబా’ మైదానం పేరునే తన బుజ్జి కుక్క పిల్లకు పెట్టుకున్నాడు! మా ఇంట్లోకి కొత్త సభ్యుడి ఆగమనం అంటూ ‘గాబా’ను పరిచయం చేశాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన సుందర్‌... శార్దుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. భారత్‌ స్కోరు 186/6గా ఉన్న దశలో వచ్చిన ఈ భాగస్వామ్యం చివర్లో కీలకంగా మారి జట్టు గెలుపునకు కారణమైంది. అన్నట్లు... 1993లో ఆస్ట్రేలియాపై సిడ్నీ వేదికగా తన తొలి టెస్టు సెంచరీ (277) చేసిన దిగ్గజం బ్రియాన్‌ లారా తన కూతురుకు ‘సిడ్నీ’ అని పేరు పెట్టిన విషయాన్ని ఇది గుర్తు చేసింది!
చదవండి: సుందర్‌, బెయిర్‌ స్టో గొడవ.. అంపైర్‌ జోక్యం

ఇంకా రెండు, మూడేళ్లు ఆడతా: ఉమేశ్‌ యాదవ్‌ 
తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను ఇంకో రెండు మూడేళ్లు కొనసాగిస్తానని భారత సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ చెప్పాడు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై దృష్టి పెట్టానని 33 ఏళ్ల ఉమేశ్‌ అన్నాడు. ఇప్పటివరకు 48 టెస్టులు ఆడిన ఉమేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. వన్డేలకు పూర్తిగా దూరమైన ఇతన్ని సెలక్టర్లు ఇప్పుడు కేవలం టెస్టు జట్టుకే పరిగణిస్తున్నారు.
చదవండి: ఆ విషయంలో సుందర్‌ నాకంటే సమర్ధుడు 

>
మరిన్ని వార్తలు