పాక్‌ కోచ్‌గా చచ్చినా చేయను: వసీం అక్రమ్‌

6 Oct, 2021 12:34 IST|Sakshi

వసీం అక్రమ్‌.. క్రికెట్‌ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు. 1992 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన అక్రమ్‌.. 1999 వన్డే వరల్డ్‌కప్‌లో కెప్టెన్‌గా పాకిస్తాన్‌ను ఫైనల్‌ చేర్చాడు. దిగ్గజ బౌలర్‌గా పేరు పొందిన అక్రమ్‌.. గతంలో వ్యాఖ్యాతగానూ పని చేశాడు. అయితే ఇంత అనుభవం ఉన్న అక్రమ్‌ ఏనాడు పాకిస్తాన్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించేందుకు ముందుకు రాలేదు. దీనిపై చాలా మందికి సందేహం ఉండగా.. తాజాగా ఈ యార్కర్‌ దిగ్గజం క్లారిటీ ఇచ్చాడు.

పాకిస్తాన్‌ కోచ్‌ పదవి చేపట్టకపోవడంపై అక్రమ్‌ ఒక ఇంటర్య్వూలో పెదవి విప్పాడు. క్రికెట్‌ కార్నర్‌ పేరుతో నిర్వహి‍ంచిన ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నాడు. ''పాకిస్తాన్‌కు కోచ్‌గా ఎంపికైతే ఫ్యామిలీకీ దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేగాక సంవత్సరంలో 200 నుంచి 250 రోజులు పాకిస్తాన్‌ క్రికెట్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఇక పాక్‌ జట్టు ఓడిపోతే అభిమానులు చేసే అల్లరి నాకు అస్సలు ఇష్టం ఉండదు. వారి ప్రవర్తన నన్ను పాకిస్తాన్‌ క్రికెట్‌ కోచ్‌ పదవికి దూరంగా ఉండేలా చేసింది. ఈ విషయం ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. అఫ్‌కోర్స్‌.. ఈ వ్యాఖ్యలు చేయడానికి నేనేం ఫూల్‌ను కాదు.  పాకిస్తాన్‌ ఏ సిరీస్‌లో ఓడిపోయినా సోషల్‌ మీడియా వేదికగా కోచ్‌ను, సీనియర్‌ ఆటగాళ్లను టార్గెట్‌ చేస్తూ వాళ్లు పెట్టే కామెంట్స్‌ చిరాకు కలిగిస్తాయి.

చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్‌ లేదంటే కేకేఆర్‌

మ్యాచ్‌లో కోచ్‌ ఆడడు.. ప్లేయర్స్‌ మాత్రమే ఆడుతారు. కోచ్‌ అనేవాడు ఆటగాళ్లకు సలహాలు మాత్రమే ఇస్తాడు. ఈ విషయం తెలుసుకోకుండా అనవసరంగా కోచ్‌ల మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తారు. మా దేశంలో జట్టు ఓడిపోవడం కంటే కోచ్‌లపై కక్షసాధింపు చర్యలే ఎక్కువ ఉంటాయి. అందుకే పాకిస్తాన్‌ జట్టుకు కోచ్‌ పదవిలో ఎక్కువకాలం ఎవరూ ఉండరు. ఇలాంటివి బయటిదేశాలలో ఎక్కువగా కనిపించవు. నా దృష్టిలో ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే నేను తట్టుకోలేను. క్రికెట్‌ను ఎంజాయ్‌ చేసేవాళ్లను.. ఇష్టంతో చూసేవాళ్లను ఎంత ప్రేమిస్తానో.. నాతో తప్పుగా ప్రవర్తించేవారిపై అంత కోపంతో ఉంటాను. అందుకే పాకిస్తాన్‌ క్రికెట్‌లో కోచ్‌ పదవిని ఎప్పుడు ఆశించలేదు.. ఆశించబోను కూడా'' అని చెప్పుకొచ్చారు.

చదవండి: T20 World Cup: కచ్చితంగా వార్నరే ఓపెనింగ్‌ చేస్తాడు: ఫించ్‌

వసీం అక్రమ్‌ తన 19 సంవత్సరాల క్రికెట్‌ కెరీర్‌లో పాక్‌ తరపున 104 టెస్టుల్లో 414 వికెట్లు, 356 వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. ఇక క్రికెట్‌ నుంచి రిటైరైన తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అంతేకాదు ఐపీఎల్‌లోనూ కేకేఆర్‌ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు.


ఇక ఇటీవలే పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి మిస్బాఉల్‌ హక్‌ పక్కకు తప్పుకున్న సంగతి తెలిసిందే. అతనితో పాటు బౌలింగ్‌ కోచ్‌ బాధ్యతల నుంచి వకార్‌ యూనిస్‌ కూడా వైదొలిగాడు. టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని పాక్‌ మాజీ స్పిన్నర్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌.. మాజీ ఆల్‌రౌండర్‌  అబ్దుల్‌ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా పీసీబీ ఎంపిక చేసింది. ఇక టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 24న టీమిండియాతో ఆడనుంది.

చదవండి: అసలైన టీ20 క్రికెటర్‌ అతడే: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు