T20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి'

29 Oct, 2022 10:16 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో పాకిస్తాన్‌ దారుణ ప్రదర్శన కనబరుస్తుంది. తొలుత భారత్‌పై ఓటమి పాలైన పాకిస్తాన్‌.. అనంతరం పసికూన జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. ఇక వరుసగా రెండు ఓటములు చవిచూసిన పాకిస్తాన్‌.. వారి సెమీస్‌ అవకాశాలను సం‍క్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో పాక్‌ జట్టుతో పాటు కెప్టెన్‌ బాబర్‌ ఆజంపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటికే బాబర్‌ ఒక పనికిరాని కెప్టెన్‌ పాక్‌ మాజీ స్పీడ్‌ స్టార్‌  షోయబ్‌ అక్తర్‌ విమర్శించగా.. తాజాగా ఈ జాబితాలోకి ఆ జట్టు మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ చేరాడు. టీ20 ప్రపంచకప్‌కు సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ను ఎంపిక చేయకపోవడంపై అక్రమ్‌ సీరియస్‌ అయ్యాడు. పాకిస్తాన్‌ మిడిలార్డర్‌ దారుణంగా ఉంది అని అతడు విమర్శించాడు. ఒక వేళ పాక్‌ కెప్టెన్‌ తాను అయి ఉంటే ఖచ్చితంగా జట్టులో మొదటి ఆటగాడిగా షోయబ్ మాలిక్ పేరు ఉండేది అని అక్రమ్‌ అభిప్రాయపడ్డాడు.

"పాక్‌ మిడిల్‌ ఆర్డర్‌ బలహీనంగా ఉందని గత ఏడాది కాలంగా మేము(పాక్‌ మాజీ ఆటగాళ్లు) పదే పదే చెప్పుతున్నాం. షోయబ్‌ మాలిక్‌ వంటి అనుభవ్ణడైనా ఆటగాడిని పిసీబీ ఇంట్లో కూర్చోబెట్టింది. అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు చేసిన పెద్ద తప్పిదం. ఒక వేళ నేను కెప్టెన్‌గా ఉంటే నా లక్ష్యం ఏంటి.. వరల్డ్‌ కప్‌ గెలవడమే కదా.

అటువంటి అప్పడు జట్టులో షోయబ్ మాలిక్ నాకు కావాలంటే.. నేరుగా ఛైర్మన్‌, చీఫ్‌ సెలక్టర్‌ దగ్గరికి వెళ్లి ఎంపికచేయమని అడిగే వాడిని. అతడిని ఎంపికచేయకపోతే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటా అనే చెప్పేవాడిని. కానీ మా జట్టలో అటువంటి వ్యక్తులు లేరు. జట్టులో ఖచ్చితంగా మాలిక్‌ ఉండాల్సింది.

ఆస్ట్రేలియాలో ఆడడం.. షార్జా లేదా పాకిస్తాన్‌లో ఆడినంత సులభం కాదు. బాబర్‌ కెప్టెన్సీ విషయంలో మరింత తెలివిగా వ్యవహరించాలి.  పాకిస్తాన్‌ ఏమీ చిన్న జట్టు కాదు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి" అని అక్రమ్‌ ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.


చదవండి: T20 WC 2022: 'ఆ జట్టుతో భారత్‌ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే అంతే సంగతి'

>
మరిన్ని వార్తలు