మతపరమైన అంశాలను ముడిపెట్టడం దారుణం

11 Feb, 2021 13:35 IST|Sakshi

ముంబై: ఉత్తరాఖండ్‌ కోచ్‌గా ఉన్నప్పుడు మతం ప్రాతిపాదికన ఆటగాళ్లకు అవకాశమిచ్చినట్లు వస్తున్న ఆరోపణలను టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ఖండించాడు. కాగా ఉత్తరాఖండ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, సెలక్టర్లు, సంఘం కార్యదర్శి తనపై చూపించిన పక్షపాతం కారణంగా వసీం జాఫర్‌ మంగళవారం ఉత్తరాఖండ్‌ హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశంలో ​పాల్గొన్నాడు.

'మతపరమైన అంశాలను క్రికెట్‌లోకి తేవడం చాలా బాధ కలిగించింది. ఇక్బాల్‌ అబ్దుల్లాను కెప్టెన్‌ చేసేందుకు ప్రయత్నించినట్లు నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నిజానికి జై బిస్టాను కెప్టెన్‌ను చేయాలని భావించా. కానీ రిజ్వాన్‌ సహా ఇతర సెలక్టర్లంతా ఇక్బాల్‌ను కెప్టెన్‌ను చేయమని సూచించారు. ఇక్బాల్‌కు ఐపీఎల్‌లో కూడా అనుభవం ఉండడంతో వారి నిర్ణయంతో ఏకీభవించాల్సి వచ్చింది. అలాగే బయోబబుల్‌లోకి మత గురువులను తీసుకొచ్చానని.. అక్కడ మేం అందరం కలిసి నమాజ్‌ చేసినట్లు అధికారులు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు.. ఆయన్ని రావాలంటూ నేను ఎప్పుడు కోరలేదు. కేవలం శుక్రవారం ప్రార్థనల కోసమే ఇక్బాల్‌ అబ్దుల్లాతో నాతో పాటు మేనేజర్‌ అనుమతి కోరాడు. ప్రాక్టీస్‌ పూర్తయ్యాకే మేము ప్రార్థనలు చేశాము. కానీ ఈ విషయాన్ని అధికారులు ఎందుకంత సీరియస్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదు' అంటూ తెలిపారు.

కాగా వసీం జాఫర్‌ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌ జట్టు ఇటీవల ముగిసిన  సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్‌ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్‌.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు.
చదవండి: 'ముందు మీ కమిట్‌మెంట్‌ చూపించండి'
రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ కీలక బౌలర్‌ దూరం

మరిన్ని వార్తలు