ఆస్ట్రేలియన్లు.. ఆస్ట్రేలియన్లలా ఆడరు ఎందుకో?!

22 May, 2021 12:52 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా.. ఆస్ట్రేలియా 2020-2021 పర్యటనను అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. సుదీర్ఘ కాలం తర్వాత బ్రిస్బేన్‌ టెస్టులో గెలుపొంది, బార్డర్‌ గావస్కర్‌ ట్రోఫీని అజింక్య రహానే సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం ఫ్యాన్స్‌ మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహ్మద్‌ సిరాజ్‌, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శుభ్‌మన్‌ గిల్‌ వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా ఈ టూర్‌ ద్వారానే తమ ప్రతిభను నిరూపించుకున్నారు. 

ఇక టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్‌ పుజారా, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌(89 నాటౌట్‌) మ్యాచ్‌కే హైలెట్‌గా నిలవగా, పుజారా పట్టుదలగా నిలబడిన విధానం(56) అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌ తాజాగా మాట్లాడుతూ.. పుజారా, పంత్‌పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. పుజారా ఆస్ట్రేలియన్‌ మాదిరిగానే బ్యాటింగ్‌ చేశాడంటూ వ్యాఖ్యానించాడు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ మార్కస్‌ వ్యాఖ్యలపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. 

‘‘అవునా... మరి ఆస్ట్రేలియన్లు, ఆస్ట్రేలియన్లలా బ్యాటింగ్‌ చేయరు ఎందుకో’’ అంటూ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా బ్రిస్బేన్‌ మ్యాచ్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పంత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో మార్కస్‌ వరుసగా 5, 38 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ ఈ మేరకు సరదాగా స్పందించడం గమనార్హం.  

చదవండి: ఎన్నో మధుర జ్ఞాపకాలు.. నా గుండె తరుక్కుపోతోంది
పుజారా ఆస్ట్రేలియన్‌ మాదిరిగానే బ్యాటింగ్‌ చేశాడు..

మరిన్ని వార్తలు