మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య ట్విటర్‌ వార్‌.. కత్తులు దూసుకున్న మాజీలు

28 Mar, 2022 16:44 IST|Sakshi

Michael Vaughan VS Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ మైకేల్ వాన్‌ల మధ్య ట్విటర్ వార్ తారాస్థాయికి చేరింది. క్రికెట్‌కు సంబంధించి తరుచూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే ఈ మాజీలు తాజాగా మరోసారి మాటల యుద్ధానికి దిగారు. వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్‌కు ఎదురైన దారుణ పరాభవం (టీ20 సిరీస్‌తో పాటు టెస్ట్‌ సిరీస్‌లో ఓటమి) నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తొలుత వసీం జాఫర్‌ విమర్శనాస్త్రాలు సంధించాడు.


ఈ ట్వీట్‌లో జాఫర్‌ ఇంగ్లండ్‌ను టార్గెట్‌ చేస్తూ వాన్‌కు చురకలు తగిలేలా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాకు సంబంధించిన ఫోటోను (జో రూట్ 1708 పరుగులు, రోరీ బర్న్స్ 530, ఎక్స్ట్రాలు 412)  షేర్‌ చేస్తూ.. ఇంగ్లండ్‌ 120 ఆలౌట్‌! ఏమైంది వాన్‌..? ఈ ఎక్స్ట్రా రన్స్ కొట్టిన ఆటగాడు ఐపీఎల్‌లో ఆడుతున్నాడా ఏంది..? అంటూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే రేంజ్‌లో ట్వీట్ (పంచ్‌) చేశాడు.  


దీనికి మైకేల్ వాన్ కూడా అదే రేంజ్‌లో కౌంటర్‌ ఇచ్చాడు. వసీం.. ఈ సమయంలో మేము మహిళల ప్రపంచకప్ సెమీస్ (మహిళల వన్డే ప్రపంచకప్‌లో  దక్షిణాఫ్రికా చేతిలో ఓడి టీమిండియా ఇంటి బాట పట్టగా.. ఇంగ్లండ్ మాత్రం బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది) మీద దృష్టి సారించాం అని బదులిచ్చాడు. ఈ ట్వీట్‌ చూసి చిర్రెత్తిపోయిన జాఫర్‌ వెంటనే మరో కౌంటరిస్తూ..


రూట్‌ సేన గత 17 టెస్ట్‌ల్లో ఒకే ఒక విజయం సాధించింది, ఇలాంటి చెత్త ప్రదర్శన చేసిన జట్టును ఎవరు మాత్రం పట్టించుకుంటారంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇందుకు వాన్‌ ఏ విధంగా స్పందించనున్నాడోనని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, విండీస్‌ పర్యటనలో ఇంగ్లండ్‌ 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను, 0-1 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. టెస్ట్‌ సిరీస్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో రూట్ సేన రెండో ఇన్నింగ్స్‌లో 120కే ఆలౌట్‌ కావడంతో విండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టెస్ట్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. 
చదవండి: IPL2022: విజయానందంలో పంత్‌ సేన.. అంతలోనే సాడ్‌ న్యూస్‌

మరిన్ని వార్తలు