IND Vs SL 2nd Test: లంకతో రెండో టెస్టుకు టీమిండియా జట్టు.. అక్షర్‌ ఎంట్రీ?

11 Mar, 2022 10:44 IST|Sakshi

టీమిండియా, శ్రీలంక మధ్య రెండో టెస్టు మార్చి 12 నుంచి బెంగళూరు వేదికగా జరగనుంది. డే అండ్‌ నైట్‌ టెస్ట్‌ కావడంతో  ఈ మ్యాచ్‌కు పింక్‌బాల్‌ను ఉపయోగించనున్నారు. ఇప్పటికే బెంగళూరుకు చేరిన ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌లో వేగాన్ని పెంచాయి. కాగా తొలి టెస్టును టీమిండియ 222 పరుగుల ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించాడు. జడేజా, అశ్విన్‌ల ద్వయం రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 15 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్‌ జరగనున్న చిన్నస్వామి స్టేడియం కూడా స్పిన్నర్లకే అనుకూలంగా ఉండనుంది.

దీనికి తోడూ అక్షర్‌ పటేల్‌ ఎంపికవడంతో టీమిండియా మరోసారి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో మూడో స్పిన్నర్‌గా ఉన్న జయంత్‌ యాదవ్‌ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అయితే డే అండ్‌ నైట్‌ కావడంతో పేస్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో సిరాజ్‌ తుది జట్టులోకి అవకాశం ఉంది. సిరాజ్‌ వస్తే అక్షర్‌ పటేల్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. మరి కెప్టెన్‌ రోహిత్‌ ఎవరికి ఓటు వేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ రెండో టెస్టుకు 11 మందితో కూడిన జట్టును ప్రకటించాడు. తొలి టెస్టులో పాల్గొన్న ఆటగాళ్లనే జాఫర్‌ కొనసాగించాడు. అయితే తొలి టెస్టులో ఆడిన జయంత్‌ యాదవ్‌ను మాత్రం తొలగించి.. అతని స్థానంలో అక్షర్‌ పటేల్ లేదా సిరాజ్‌కు చోటు కల్పించాడు. అక్షర్‌ పటేల్‌ టెస్టు అరంగేట్రం సూపర్‌ అని జాఫర్‌ పేర్కొన్నాడు. ఐదు టెస్టుల్లోనే 36 వికెట్లు తీసిన అక్షర్‌కు ఐదుసార్లు ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడని తెలిపాడు.

అయితే  డే అండ్‌ నైట్‌ టెస్టు కావడంతో బంతి పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో సిరాజ్‌ వైపు కూడా రోహిత్‌ మొగ్గుచూపే అవకాశముందన్నాడు. ఏదైనా తొలి టెస్టులో ఆడిన జట్టే దాదాపు ఉంటుందని.. కేవలం పదకొండో స్థానం కోసం అక్షర్‌, సిరాజ్‌లు పోటీ పడుతున్నారని వివరించాడు. నా దృష్టిలో అయితే రెండో టెస్టులో అక్షర్‌ పటేల్‌ ఆడితేనే బాగుంటుంది అని వెల్లడించాడు. ఇక శ్రీలంక జట్టు రెండో స్పిన్నర్‌ సేవలను కోల్పోయిందని.. కనీసం రెండో టెస్టులోనైనా రెండో స్పిన్నర్‌కు అవకాశం ఇస్తే కాస్త పోరాడే ప్రయత్నం చేయొచ్చని తెలిపాడు. 

లంకతో రెండో టెస్టుకు జాఫర్‌ టీమిండియా ఎలెవెన్‌ జట్టు: 
రోహిత్ శర్మ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవి అశ్విన్, అక్షర్ పటేల్ / మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.

చదవండి: India Vs Sl 2nd Test: అప్పుడు ఘోర పరాభవం.. ఇప్పుడు రెండో టెస్టుకు ముందు శ్రీలంకకు భారీ షాక్‌!

PAK Vs AUS: టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్‌: ఐసీసీ

మరిన్ని వార్తలు