'ఏం బాధపడొద్దు.. మనోళ్లకు ఇది అలవాటే'

9 Feb, 2021 17:15 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై అభిమానులెవరు బాధపడాల్సిన అవసరం లేదంటూ మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఇదివరకు చాలాసార్లు టెస్టు సిరీస్‌ను ఓటమితో ఆరంభించి మళ్లీ ఫుంజుకుందని.. మనోళ్లకు ఇది అలవాటేనంటూ పేర్కొన్నాడు. టీమిండియా టెస్టు మ్యాచ్‌ ఓటమి అనంతరం జాఫర్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు.

'అభిమానులారా.. మీరెవరు బెంగపడకండి.. ఆసీస్‌ టూర్‌ను ఇలాగే ఓటమితో ప్రారంభించిన టీమిండియా తర్వాత సిరీస్‌ను గెలిచింది. అంతకముందు స్వదేశంలోను తొలి టెస్టు మ్యాచ్‌ ఓడి ఆ తర్వాత సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనత మన టీమిండియాకు ఉంది. ఒక్కమ్యాచ్‌ ఓడిపోయినంత మాత్రానా సిరీస్‌ కోల్పోయినట్టు కాదు.. ధైర్యంగా ఉండండి.'అంటూ పేర్కొన్నాడు. గతేడాది డిసెంబర్‌లో ప్రారంభమైన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీలో టీమిండియా అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన మిగతా మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

అంతకముందు 2019లో స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఓటమితోనే ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో కోహ్లి సేన ఓటమి పాలయిన తర్వాతి టెస్టుల్లో ఫుంజుకొని అనూహ్యంగా 2-1 తేడాతో సిరీస్‌ను కొల్లగొట్టింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు చెన్నై వేదికలోనే ఫిబ్రవరి 13 నుంచి జరగనుంది.

చదవండి: కెప్టెన్‌గా రూట్‌ అరుదైన రికార్డులు
ఒక్క విజయంతో టాప్‌కు దూసుకెళ్లింది

మరిన్ని వార్తలు