'ప్లీజ్‌.. పీటర్సన్‌ను ఎవరు ట్రోల్‌ చేయొద్దు'

17 Feb, 2021 10:30 IST|Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగులతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ జీర్ణించుకోలేకపోయాడని అతని ట్వీట్‌ ద్వారా తెలుస్తుంది. మ్యాచ్‌ అనంతరం టీమిండియా అభిమానులను కవ్విస్తూ పీటర్సన్‌ ఒక ట్వీట్‌ చేశాడు. 'భారత్‌కు శుభాకాంక్షలు. ఇంగ్లండ్-బి జట్టును ఓడించినందుకు' అంటూ పేర్కొన్నాడు. ఇది సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ కావడంతో టీమిండియా మాజీ ఆటగాళ్లు పీటర్సన్‌కు అదిరిపోయే పంచులు ఇచ్చారు.

తాజాగా వసీం జాఫర్‌, పీటర్సన్‌ల మధ్య ట్విటర్‌లో జరిగిన సంభాషణ​ అందరిని ఆకట్టుకుంది. పీటర్సన్‌ ట్వీట్‌ను షేర్‌ చేస్తూ..' ప్లీజ్‌.. కెవిన్ పీటర్సన్‌ను ఎవరు ట్రోల్ చేయకండి. కేపీ సరదాగానే ఇలా చేస్తున్నాడు.  కానీ అతని ట్వీట్‌ ద్వారా నాకో విషయం అర్థమైంది. దక్షిణాఫ్రికా వాళ్లు లేకుండా ఇంగ్లండ్ పూర్తి సామర్థ్యం కలిగిన జట్టు ఎలా అవుతుంది? అంటూ' చురకలంటించాడు. కాగా పీటర్సన్‌ దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లండ్‌కు వలస వెళ్లి ఇంగ్లండ్‌ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జాఫర్‌ వ్యాఖ్యలను అభిమానులు మెచ్చకుంటూ తమదైన శైలిలో కామెంట్లు పెట్టారు. పీటర్సన్‌కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చావు.. జాఫర్‌ సమాధానంతో పీటర్సన్‌ మైండ్‌ బ్లాంక్‌ అయ్యి ఉంటుంది అని పేర్కొన్నారు.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. టీమిండియా విధించిన 482 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఇంగ్లండ్‌ జట్టు 168 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది. టీమిండియా బౌలర్‌ అక్షర్‌పటేల్‌ 5 వికెట్లతో సత్తా చాటగా.. అశ్విన్‌ 3, కుల్దీప్‌ యాదవ్‌ 2 వికెట్లు తీశారు. కాగా ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ మిగతా రెండు టెస్టులకు దూరం కానున్నట్లు కెప్టెన్‌ రూట్‌ తెలిపాడు. కుటుంబంతో గడిపేందుకు అలీ ఇంగ్లండ్‌కు బయలుదేరాడని.. అందుకే మిగతా టెస్టులకు అందుబాటులో ఉండడం లేదని తెలిపాడు. ఇక మూడో టెస్టుకు రొటేషన్‌ పాలసీ ప్రకారం అండర్సన్‌ తుదిజట్టులోకి రాగా.. జానీ బెయిర్‌ స్టో, మార్క్‌ వుడ్‌లు కూడా చోటు సంపాదించారు. ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 24(బుధవారం) డే నైట్‌ మ్యాచ్‌ జరగనుంది.
చదవండి: అశ్విన్‌ దెబ్బకు స్టోక్స్‌ బిక్కమొహం
టీమిండియాకు ఒకటి.. ఇంగ్లండ్‌కు మాత్రం రెండు

>
మరిన్ని వార్తలు